ఆ మూడూ కలిసినట్టే!.. జగన్‌కి మూడినట్టే!?
Published on: Mon Mar 21, 2022 12:30PM
ఏపీ రాజకీయ రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరగబోతున్నాయా? అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయా? ఇప్పటికే జనసేన- బీజేపీల మధ్య స్నేహం బలంగానే ఉందని, మరో పార్టీ తెలుగుదేశం విషయంలోనే మరి కాస్త స్పష్టత రావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలు ఒక్కటై వచ్చే ఎన్నికల్లో బరిలో దిగితే ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చారని విర్రవీగిపోయి ప్రవర్తిస్తున్న వైసీపీకి ఏ గతి పడుతుంది? అనే దానిపై అంచనాలు జోరుగా సాగుతున్నాయి.
అమరావతి ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభా వేదికగా ఆ పార్టీ అధినేత ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోం’ అంటూ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చైతన్యం పెరిగిపోయింది. జనసేనాని ప్రకటనతో జనంలో కూడా అప్పుడే 2024 ఎన్నికల ఊపు వచ్చిన సంకేతాలు వస్తున్నాయి. ఆ తర్వాత సీఎం జగన్ సొంత జిల్లా కేంద్రం కడపలో బీజేపీ నిర్వహించిన ‘రాయలసీమ రణభేరి’ సభలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనతో తమ బంధం బలంగానే ఉందని పేర్కొన్నారు. దాంతో పాటు ప్రధాన ప్రతిపక్షం కూడా తమతో చేతులు కలిపితే.. వైసీపీ మెడలు వంచడం మరింత ఈజీ అవుతుందనే ధోరణిలో చెప్పడం గమనార్హం.
ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటల నేపథ్యంలో అధికార వైసీపీ అప్రమత్తం అయిందంటున్నారు. ఏడాది తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే హడావుడి ప్రారంభించిందట. సాక్షాత్తుగా సీఎం జగనే ఇందుకు సంబంధించి తమ పార్టీ నేతలకు కీలక సూచనలు చేయడం విశేషం. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు జగన్ ఆదేశాలు జారీచేశారు. జనసేన- బీజేపీ- టీడీపీ ఏకమై వెల్లువెత్తితే తన పార్టీ పార్టీకి పుట్టగతులుండవనే అంచనాతోనే ఆయన ముందుగానే జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. మరో పక్కన సీఎం జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సర్వేలు చేయించుకుంటున్నారు. ఆ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. పెగాసస్ స్పైవేర్ ను చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారని చెప్పడం విశేషం. ఇప్పుడా వ్యవహారం అధికార వైసీపీ, ప్రతిపక్షటీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి, సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీపైన, చంద్రబాబుపైన బురదజల్లి లబ్ధిపొందాలనే ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే పెగాసస్ వ్యవహారం బయటికి వచ్చిందంటారు. ఎందుకంటే అటు మమతా బెనర్జీకి ఇటు జగన్ కు కూడా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోరే వ్యవహరిస్తున్నారు మరి.
నిజానికి 2014 లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించినా అప్పటి ఎన్నికల్లో బరిలో దిగలేదు. బీజేపీ- టీడీపీలకే డైరెక్ట్ గాను జనసేనాని మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో ఆయన టీడీపీ, బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే.. 2019 ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు మారాయి. టీడీపీ- జనసేన- బీజేపీలు విడివిడిగానే బరిలో దిగాయి. వచ్చే ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగానే ఈ మూడు పార్టీలూ విడివిడిగానే పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నప్పటికీ తమకు ఉమ్మడి శత్రువైన వైసీపీని ఎదుర్కోవాలంటే ఒక్కటి కాక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామనడం.. పవన్ ప్రకటనకు కొనసాగింపుగా జనసేనతో తమ పొత్తు ఉంటుందని, జనసేనతో ఎన్నికలకు కలిసే వెళ్లామని కూడా ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ అమరావతి సభలో అన్న మాటలకు కూడా సోము వీర్రాజు కడప సభలో సానుకూలంగా స్పందించడం విశేషం. బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమైందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది తమ అభిప్రాయమని పేర్కొనడం గమనార్హం. మరో పక్కన టీడీపీ- జనసేన మధ్య బంధం కూడా పరోక్షంగా బలంగానే కొనసాగుతోందంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ- జనసేన పొత్తుతో బరిలో దిగిన విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా బీజేపీ- జనసేన కూటమితో కలిసి నడుస్తుందా అనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీతో పొత్తు గురించి తాము ఎక్కడా చెప్పలేదని సోము వీర్రాజు అన్నప్పటికీ ఆంతరంగికంగా ఆ దిశగా పావులు కదులుతున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా టికెట్ల ధరలను జగన్ రెడ్డి సర్కార్ తగ్గించినప్పుడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పలువురు నేతలు పవన్ కళ్యాణ్ కు బహిరంగంగానే మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన ద్వారా మార్గం సుగమం చేసుకునేందుకు.. బీజేపీతో వచ్చే ఎన్నికల్లో ఒక్కటయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నదనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉండదని టీడీపీ ఎక్కడా చెప్పలేదు.. అలాంటి సంకేతాలు కూడా ఎప్పుడు ఇవ్వకపోవడం ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఏదేమైనా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాల్సిన ఆవశ్యకత ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పోలరైజేషన్ కావాలంటే జనసేన- బీజేపీ- టీడీపీ ఏకం కావడం ఒక్కటే మార్గం అంటున్నారు. అదే జరిగితే అధికార వైసీపీకి ‘జజ్జనకర జనారే’ తప్పదేమో! అనే అభిప్రాయాలు వస్తున్నాయి.


