శ్రీదేవి దూకుడు.. పార్టీలో కుంపట్లు...
Published on: Tue Mar 22, 2022 11:18AM
అధికార వైయస్ జగన్ పార్టీలో మహిళ ఎమ్మెల్యేలపై నియోజకవర్గ ప్రజల్లో అసమ్మతి సెగ రాజుకొంది. ఆ క్రమంలో ఇప్పటికే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సదరు నియోజకవర్గంలోని అయిదు మండలాల ప్రజలు.. ఆమెకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారన్న టాక్ అయితే చిత్తూరు జిల్లాలో యమ జోరుగా నడుస్తోంది. తాజాగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా అసమ్మతిని మూట కట్టుకొని.. రోజా బాటలోనే నడుస్తోన్నారనే టాక్ అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా మస్త్ మస్త్‌గా సాగుతోంది.
తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా నేను మోనార్క్... అనే స్టైల్‌లో వ్యవహరిస్తోండడంతో.. నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా.. ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సమాచారం. అందుకే సదరు ఎమ్మెల్యేపై వారంతా తిరుగుబాటుకు తెర తీశారనే చర్చ సైతం నియోజకవర్గంలో హాట్ హాట్‌గా నడుస్తోంది.
ఎమ్మెల్యే శ్రీదేవి దూకుడుకు సొంత పార్టీలోని వారే అల్లాడిపోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే మాత్రం.. ఆమె ఓటమికి గల కారణాలను దయచేసి మమ్మల్ని అడగవద్దంటూ .. సదరు నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీ ఎస్సీ నేతలు.. ఆ పార్టీ అగ్రనేతలతో పేర్కొన్నట్లు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ఓ టాక్ అయితే నడుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే శ్రీదేవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి నేతలంతా ఓ తీర్మానం కూడా చేశారట. అంతేకాదు.. ఆమెపై వారంతా ఆరోపణలను సైతం సంధిస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోంటున్నారని... వాలంటీర్ ఉద్యోగాలు సైతం అమ్ముకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదని.. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తల కుటుంబాలను సైతం ఆమె పట్టించుకోరని.. అలాగే అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసేలా.. ప్రయత్నాలు కూడా ఆమె చేయరని.. క్షేత్రస్థాయిలోని నేతలంతా మరీ గుర్తు చేస్తున్నారు.
ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆమె వ్యవహారశైలి వివాదాస్పదమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి ఆమె కేడర్‌ను దూరంగా పెట్టడం.. అక్కడితో ఆగకుండా.. తన చుట్టు కోటరి ఒకటి ఏర్పాటు చేసుకుని.. నియోజకవర్గంలో నాయకులను రెండు గ్రూపులుగా విభజించారనే ఓ చర్చ అయితే ఎప్పటి నుంచి ఉంది. ఏమైనా అంటే జగన్ అండ్ కో వద్ద తనకు బాగా పలుకుబడి ఉందని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. ఆమె బాహాటంగానే వ్యాఖ్యానిస్తుంటారన్న స్థానిక పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం.
తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ వారిపైన కూడా పోలీసు కేసులు పెట్టించడం ఆమెకు ఓ రివాజుగా మారిందనే టాక్ అయితే తాడికొండలో ఉంది. పనులు చేసే కాంట్రాక్టర్లను సైతం ఆమె వదలరని.. కమిషన్లు పేరుతో నానా హడావుడి చేస్తారని అంతా అంటున్నారు. ఎంపీ నిధులతో జరుగుతున్న పనులకు సైతం తనకు కమిషన్లు ఇవ్వాలంటే అజమాయిషీ చెలాయిస్తారని.. అలా అయితే ఎలా అంటూ సదరు కాంట్రాక్టర్లు.. పనులు సైతం నిలిపివేసి.. ఎమ్మెల్యేపై చర్యలకు పట్టుపట్టడం గతంలో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇదే అంశంపై స్థానిక ఎంపీతో కూడా ఆమె ఘర్షణకు దిగినట్లు సమాచారం. మరోవైపు రాజధానిపై కూడా ఆమె తీవ్ర విమర్శలు చేయడం పట్ల అమరావతి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే దేశంలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని ఐఏఎన్ఎస్ - సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే గతేడాది అక్టోబర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సర్వే చెప్పింది అక్షరాల సత్యమని... రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరే అందుకు తాజా ఉదాహరణ.


