TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూయార్క్ టైమ్స్ లో అమరావతి కథనం.!

Published on: Fri Aug 14, 2026 9:08AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని   అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అమరావతి డిజైన్, అభివృద్ధి, నగర నిర్మాణంలో వేగం ఇలా అమరావతికి సంబంధించిన ప్రతి అంశానికీ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు వస్తోంది. తాజాగా   ది న్యూయార్క్ టైమ్స్ అమరావతి నిర్మాణం, పురోగతి, ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం ప్రచురించింది. దానికి   ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సామాజిక ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇండియాలో  నగర జీవన ప్రమాణాలకు అమరావతి ఒక కొత్త కొలమానాన్ని నిర్దేశిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.   పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, పర్యావరణహితమైన, అత్యాధునిక సాంకేతికతతో కూడిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే తన ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు. 

అమరావతిని  నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిని వివరిస్తూ  ది న్యూయార్క్ టైమ్స్  సమగ్ర విశ్లేషణాత్మక కధనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఒక వ్యక్తి (చంద్రబాబు) దృఢ సంకల్పంతో ఇండియాలో దేశంలోనే అతి పెద్ద పట్టణ ప్రణాళిక రూపుదిద్దుకుందని ఆ కథనంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కృష్ణా నదీ తీరాన   ఆధునిక మౌలిక వసతులతో నూతన నగరం రూపుదిద్దుకుంటున్న తీరును ఈ కథనం కళ్లకు కట్టింది. పర్యావరణ పరిరక్షణ,  ఆధునిక అవసరాలకు తగినట్లుగా నగర డిజైన్ ఉందంటూ ప్రస్తుతించింది.

నగర వైశాల్యంలో దాదాపు 60 శాతం పచ్చదనం, జల వనరులకే కేటాయించారనీ, పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా వేల మైళ్ల పొడవైన ప్రత్యేక సైక్లింగ్ మార్గాలు, అంతర్గత జలమార్గాలకు ప్రాధాన్యత ఇచ్చారనీ పేర్కొంది.   ప్రసిద్ధ  ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్  లేఅవుట్ ప్రకారం రాజధాని నగర పరిపాలనా కేంద్రాలు,  అసెంబ్లీ  భవనం,  ఇతర ప్రధాన మౌలిక వసతుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని వివరించింది.  

ఇంకా ఆ ప్రత్యేక కథనంలో న్యూయార్క్ టైమ్స్.. అమరావతి   పాలనా నగరంగానే  గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారేందుకు చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న ప్రణాళికలూ ప్రస్తుతించింది.  50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీని ప్రత్యేకంగా ప్రస్తావించింది.   దీని ద్వారా  అత్యాధునిక డీప్ టెక్నాలజీ,  పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న తీరునూ పేర్కొంది.  ఐటీ దిగ్గజం ఐబీఎంకు చెందిన క్వాంటం కంప్యూటింగ్ మౌలిక వసతులను ఇక్కడ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతిని వివరించింది. ఈ టెక్ హబ్  వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. 

అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు రాజధాని పరిధిలోని రైతులు, పెట్టుబడిదారులు మరియు ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. రాజధాని నిర్మాణ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమౌతున్న సానుకూల దృక్పథం రాబోయే రోజుల్లో బహుళజాతి కంపెనీల పెట్టుబడులను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.

Special story on Amarawathi, Newyork Ttimes, CBN, Share, Social Media, World Class, City