ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌ అలీపై జరిగిన దాడి కేసులో అసదుద్దీన్ కోర్టుకు‌ హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుసార్లు అసదుద్దీన్ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

 

2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో షబ్బీర్ అలీ ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కారు లోపల కూర్చున్న షబ్బీర్ అలీపై కొందరు దాడి కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనలో అసదుద్దీన్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్ష్యులు, వీడియోలు ఉన్నట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే, షబ్బీర్‌ అలీపై దాడిలో తన పాత్ర లేదని గతంలో అసుదుద్దీన్ తెలిపారు. తాను దాడి చేసే వారిని అడ్డుకున్నానని చెప్పారు. ఈ కేసులో అసదుద్దీన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మీర్‌చౌక్ పోలీసులు దీనికి కౌంటర్ దాఖలు చేశారు. షబ్బీర్‌ అలీపై దాడిలో అసదుద్దీన్ పాత్ర ఉందని కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో అసదుద్దీన్ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే అసదుద్దీన్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు.