సీఎల్పీ లీడర్ గా భ‌ట్టి విక్ర‌మార్క తొలగింపు!!

 

తెలంగాణలో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తరపున 19 మంది ఎమ్మ‌ల్యేలు గెలిచారు. అయితే వారిలో 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరారు. దాంతో కాంగ్రెస్ బ‌లం 7కు ప‌డిపోయింది. దానికితోడు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి న‌ల్ల‌గొండ ఎంపీగా గెలుపొంద‌డంతో ఇటీవ‌ల త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 7 కాస్తా 6కు ప‌డిపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ కి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను తొలిగిస్తూ స్పీక‌ర్ కార్యాల‌యం మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌తి ప‌క్ష హోదా నుంచి కాంగ్రెస్ పేరును తొలిగిస్తూనే.. సీఎల్పీ నేత‌గా వున్న భ‌ట్టి విక్ర‌మార్క పేరును కూడా తొలిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ వ‌ర్గాల‌కు అసెంబ్లీలో ఘోర అవ‌మానం జ‌రిగిన‌ట్ల‌యింది. మంగ‌ళ‌వారం ఇచ్చిన ఉత్త‌ర్వులు స్పీక‌ర్ ఆమోదం తెల‌ప‌డంతో బుధ‌వారం మీడియాకు విడుద‌ల చేశారు. దీంతో కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్ పై, అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం చెల్ల‌దంటూ కాంగ్రెస్ ఇటీవ‌ల హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. వివాదం కోర్టులో వుండ‌గా ఇలా ఎలా ఉత్త‌ర్వులు జారీ చేస్తార‌ని స్పీక‌ర్ పై కాంగ్రెస్ నేత‌లు మండిపడుతున్నారు.