TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక వేటే తరువాయి

Published on: Wed Feb 8, 2012 9:18AM

హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో, ఇప్పుడు అందరి దృష్టి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మద్దతుదారులైన 17మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపైనే కేంద్రీకృతమైంది. కాంగ్రెస్‌కు చెందిన 16మంది ఎమ్మెల్యేలపైన, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేపైన విచారణ పూర్తి చేసిన స్పీకర్ నాదెండ్ల మనోహర్, తీర్పును సైతం సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుల్లో తీర్పు ఎప్పుడు ప్రకటించాలన్న ముహూర్తాన్ని మాత్రమే స్పీకర్ నిర్ణయించాల్సి ఉంది. ఈనెల 23నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న దృష్ట్యా ఈలోగానే స్పీకర్ తీర్పు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలావుంటే, అనర్హత కేసులు ఎదుర్కొంటున్న 17మందిలో పీఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో జరిగిన ఓటింగ్‌లో పార్టీ విప్‌ను ధిక్కరించిన శోభానాగిరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. తర్వాత పరిణామాల్లో శోభానాగిరెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. సహజ న్యాయసూత్రాలకు కట్టుబడి శోభానాగిరెడ్డిపై అనర్హత వేటు వేయకుండా ఆమె రాజీనామానే ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు చెందిన 16మంది ఎమ్మెల్యేలపై మాత్రం అనర్హత వేటు వేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా తమపై అనర్హత వేటు వేయనట్లయితే సమావేశాల్లో ప్రభుత్వాన్ని చిక్కుల్లోపెట్టే విధంగా జగన్ వర్గం ఎమ్మెల్యేలు వ్యూహ రచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని అవకాశం లభించినపుడల్లా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని జగన్ వర్గం ఎమ్మెల్యేలు నిర్ణయించారు.