యూపీలో కూటమిదే హవా.. బీజేపీకి భారీ దెబ్బ

 

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఈసారి యూపీలో అధికార బీజేపీకి చేదు అనుభవం తప్పదని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. యూపీలో ఎస్పీ- బీఎస్పీల కూటమి 40 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. దేశంలో ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి వల్ల బీజేపీ పెద్ద మొత్తంలో నష్టపోతుందని సర్వే పేర్కొంది.
 
గత ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లకు గాను బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇక ఎస్పీ విషయానికొస్తే.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసింది. ఎస్పీ 7, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. కాగా ఈసారి బీజేపీని ఎదుర్కోవడానికి ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపాయి. దీంతో బీజేపీ భారీగా నష్టపోతుందని ఇప్పటికే అనేక సర్వేలు చెప్పాయి. తాజాగా ఇండియా టుడే సర్వే కూడా ఎస్పీ-బీఎస్పీ కూటమికి 40 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. బీజేపీకి 35 సీట్లు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ 4 సీట్లు గెలుస్తుందని తెలిపింది. మొత్తానికి ఎస్పీ-బీఎస్పీ కూటమి దెబ్బకి బీజేపీ యూపీలో 36 సీట్లు కోల్పోయే అవకాశముంది.