TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షావుకారు జానకి ఇక లేరు.!

Published on: Fri Aug 21, 2026 3:59PM

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె వయస్సు 94ఏళ్లు.   వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (ఆగస్టు 21) మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన శంకరమంచి జానకి, పిన్న వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో రేడియో జాకీగా విధులు నిర్వర్తించారు. గర్భవతిగా ఉన్న సమయంలోనే   మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, తదనంతర కాలంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తెలుగు సినీ ప్రపంచంలో విశేష ప్రజాదరణ పొందిన దివంగత   నటి కృష్ణకుమారి ఈమెకు సొంత చెల్లెలు. జానకి  మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా వెండితెరపై నటిగా రాణించారు.

ఇక జానకి సినీ ప్రస్థానం విషయానికి వస్తే.. 1950లో  ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన  షావుకారు  అనే  సినిమా ద్వారా ద్వారా ఆమె  వెండి తెరకు పరిచయం అయ్యారు. మొదటి చిత్రంలోనే తన   నటనా ప్రావీణ్యంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా పేరు షావుకారు నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆ తర్వాత  వలయాపతి సినిమా ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమైన జానకి 1954లో  దేవకన్నిక' చిత్రంతో కన్నడ రంగానికి, 1964లో  స్కూల్ మాస్టర్ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకూ పరిచయమయ్యారు.  

సాంప్రదాయమైన పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన వేషధారణతో బహుభాషా నటిగా గుర్తింపు పొందిన షావుకారు జానకి.. భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన అత్యుత్తమ సేవలను, కళారంగానికి చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2022లో ఆమెను  పద్మశ్రీ పురస్కారంతో  గౌరవించింది.  

షావుకారు జానకి మృతి వార్తతో  సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చలనచిత్ర రంగాలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు,  రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల   సంతాపం వ్యక్తం చేశారు. షావుకారు జానకి మృతి దక్షిణ భారత సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. చెన్నైలోని ఆమె నివాసానికి సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా చేరుకుని ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు.  

Sowcar Janaki Passed Away, Sowcar Janaki Death News, Senior Actress Sowcar Janaki, Tollywood News TeluguOne