TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ...

Published on: Mon Oct 14, 2019 4:02PM

 

బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపిక దాదాపు ఖరారైంది. ఈరోజు అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ ల తుది గడువు కావడంతో గంగూలి ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్లేనని భావిస్తున్నారు. బిసిసిఐ అధ్యక్షుడిగా ఇప్పటి వరకూ గంగూలీ తప్ప ఎవరూ నామినేషన్ వేయలేదు, దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. బీసీసీఐ రాష్ట్ర సంఘాల ప్రతినిధులు నిన్న ముంబైలో సమావేశమయ్యారు. కీలక పదవుల్లో ఎవరు ఉండాలనే దానిపై వారి మధ్య చర్చ జోరుగా సాగింది.

ముఖ్యంగా సౌరవ్ గంగూలీ, బ్రిజేష్ పటేల్ ల మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రంగా నడిచింది. మొదట శ్రీనివాసన్ సన్నిహితుడు బ్రిజేష్ పటేల్ అధ్యక్ష రేసులో ముందు నిలిచాడు. గంగూలీకి ఐపీఎల్ ఛైర్మెన్ పదవి ఇవ్వాలని భావించారు, అందుకు గంగూలీ తిరస్కరించినట్లు సమాచారం. అధ్యక్షుడిగా బ్రిజేష్ అభ్యర్థిత్వాన్ని ఎక్కువ రాష్ట్ర సంఘాలు కూడా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చివరకు గంగూలీకి బోర్డు అధ్యక్ష పదవి కట్టబెట్టి బ్రిజేష్ కు ఐపిఎల్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని సభ్యులు నిర్ణయానికి వచ్చారు.

అయితే బ్రిజేష్ మాత్రం అందుకు అంగీకరించలేదు, ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ గడువు ఉంది. ప్రస్తుతం గంగూలి నామినేషన్ తప్ప మరెవరూ వేయలేదు. వేసినట్లయితే అక్టోబర్ ఇరవై మూడున బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి. ఇక హోంమంత్రి అమిత్ షా తనయుడు జయ్ షా కార్యదర్శిగా పోటీ లో ఉన్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ కోశాధికారిగా ఎన్నికవడం కూడా ఖరారైనట్లే.

నలభై ఏడేళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, బిసిసిఐ అధ్యక్షుడైతే తప్పని సరి విరామ నిబంధనల వల్ల ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ లో అతడు పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. అధ్యక్షుడిగా తన తొలి బాధ్యత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను అభివృద్ధి చేయడమే అన్నారు సౌరవ్ గంగూలీ. మూడేళ్ళుగా సీఓఏ లాంటి అభివృద్ధి చేయలేదని, తన హయాంలో రాష్ట్ర సంఘాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి కళంకం వచ్చేలా గతంలో కొందరు ప్రవర్తించారని అలాంటి చెడ్డ పేరును నిర్మూలించడమే తన లక్ష్యమన్నారు గంగూలి.