నాలుగు కాళ్లు నాలుగు చేతులతో చిన్నారి.. సోనూ సూద్ సహకారంతో ఏం జరిగిందంటే..
Published on: Mon May 30, 2022 7:55AM
ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదని ఆమెను చూసిన వారంతా అనుకున్నారు. జన్యు లోపం కారణంగా ఆ చిన్నారి పుట్టుకతోనే ఓ చిత్రమైన సమస్యతో బాధపడుతోంది. ఆమెకు అందరిలా రెండు చేతులు, కాళ్లతో కాకుండా పొట్ట భాగంలో మరో రెండు చేతులు కాళ్లతో పుట్టింది. జన్యులోపం కారణంగా విచిత్ర రూపంలో పుట్టినప్పటి నుంచీ బాధపడుతున్న ఆమెకు పెరుగుతున్న కొద్దీ బాధలు మరింత ఎక్కువయ్యాయి.
తోటి పిల్లలెవ్వరూ ఆమె రూపం కారణంగా దగ్గరకు రానివ్వడం లేదు. అందరిలా ఆడుకోలేక, అందరిలో కలవలేక ఇబ్బంది పడుతున్న ఆమెకు ఆపరేషన్ చేస్తే మామూలు మనిషి అవుతుందని వైద్యలు చెప్పారు. అప్పటి నుంచీ ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల కోసం, సాయం కోసం ఎక్కని గడప లేదు, తట్టని తలుపు లేదన్నట్లు తిరిగారు. రెక్కడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి సొంత ఖర్చుతో తమ కూతురికి ఆపరేషన్ చేయించే స్తోమత లేదు. ఆ చిన్నారి కష్టం సామాజిక మాధ్యమం ద్వారా నటుడు సోనూ సూద్ దృష్టికి వెళ్లింది.
కరోనా సమయంలో ప్రభుత్వాలు పట్టించుకోని వలస జీవుల కష్టాలను కడతేర్చడానికి బస్సులు ఏర్పాటు చేసి, అవసరమైతే విమాన టికెట్లు కొనిచ్చి మరీ వారిని స్వస్థలాలక పంపడం ద్వారా సినీనటుడిగా విలన్ వేషాలు వేసినా.. దాతృత్వంలో, ఆపన్నులకు సహాయ హస్తం అందించడంలో హీరోననని చాటుకున్న సోనూ సూద్ ఆ తరువాత కూడా అవసరమైన వారికి సహాయం అందిస్తూనే ఉన్నాడు. సోనూ సూద్ సేవా కార్యక్రమాలను, ఆయనకు ప్రజల్లో వస్తున్న పలుకుబడిని ఓర్వలేని బీజేపీ నేతలకు కొందరు రాజకీయ స్టంట్ అంటూ విమర్శలు చేసినా పట్టించుకోలేదు.
కరోనా తరువాత కూడా ఆయన తన సేవాకార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ చిన్నారి కష్టం తెలియగానే ఆపరేషన్ చేయించడానికి ముందుకు వచ్చాడు. బీహార్ కు చెందిన ఓ పేద కుటుంబానికి చెందిన ఓ చిన్నారి రెండున్నరేళ్లుగా వింత సమస్యతో బాధపడుతోందని, పొట్ట భాగంలో రెండు కాళ్లు, రెండు చేతులతో జన్మించిందపీ తెలుసుకుని వెంటనే ఆమె ఆపరేషన్ కు కావలసిన సహాయం అందించాడు. ఆ బాలిక పేరు చౌముఖి, బీహార్ లోని నెవాడా వాసి. సోనూ సూద్ సాయంతో చౌముఖికి వైద్యం అందుతోంది. త్వరలోనే ఆపరేషన్ చేస్తామనీ, ఆమె మామూలు మనిషి కావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. చౌముఖికి వైద్యం అందుతున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ చిన్నారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


