సోనియాకు టెన్షన్..ప్రణబ్ కు మొర

Publish Date:Aug 19, 2013

Advertisement

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనసహా సరిహద్దులలో ఉద్రిక్తత, పార్లమెంటులో బిల్లుల ఆమోదం, రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం తదితర సమస్యలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె, ఒకనాటి తమ పార్టీ 'గడ్డు సమస్యల పరిష్కర్త', నేటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శరణుజొచ్చారని సమాచారం. రెండు రోజుల కిందట మధ్యాహ్న భోజన సమయంలో ఆయనతో భేటీ అయిన సోనియా, గంటన్నరపాటు అనేక అంశాలపై మాట్లాడారు. కానీ, వారి సంభాషణ సారాంశం ఏమిటో చెప్పలేమని పార్టీ వర్గాలు అంటున్నాయి.

 

అయితే, నియంత్రణ రేఖవద్ద పాక్ సైనిక మూకలు ఐదుగురు జవాన్లను బలిగొనడం, దాంతోపాటు దాదాపు 15 రోజులుగా కాల్పులు కొనసాగించడం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇక "సహనానికీ హద్దులుంటాయ''ని స్వాతంత్య్ర దినం ముందురోజున తన ప్రసంగంలో ప్రణబ్ పాక్‌ను గట్టిగానే హెచ్చరించారు. కానీ, మరునాడు ప్రధాని మన్మోహన్ ఎర్రకోట ప్రసంగం చప్పగా చల్లారిపోవడం సోనియాను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని భోగట్టా. అంతకుముందు కూడా పాక్‌పై మెతకదనం పనికిరాదని, మరింత కఠినవైఖరి అవసరమని పార్టీ ఒత్తిడి తెచ్చింది.ఫలితంగానే భారత్ వ్యతిరేక పాక్ జాతీయ చట్టసభ తీర్మానాన్ని ఖండిస్తూ మన పార్లమెంటులో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చేనెల ఆ దేశ ప్రధానితో మన్మోహన్ భేటీపైనా కచ్చితమైన సమాచారం పంపలేదనీ తెలిసింది. ఇవన్నీ అటుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై తన కలవరాన్ని అధినేత్రి ఆయనవద్ద వెళ్లబోసుకున్నారని సమాచారం. దీంతోపాటు తెలంగాణ, సీమాంధ్ర చిక్కుముడిపైనా వారు చర్చించినట్లు తెలియవచ్చింది.