వైసీపీ, టీఆర్‌ఎస్‌ కు సోనియా గాంధీ ఆహ్వానం!!

 

'ఈ ఎన్నికల్లో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్నాయి. అలా అని బీజేపీ, కాంగ్రెస్ లలో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేవు' అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఓ వైపు మిత్ర పక్షాలను కాపాడుకుంటేనే.. మరోవైపు తటస్థ పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ ఓ అడుగు ముందు ఉందనే చెప్పాలి. బీజేపీయేతర కూటమి పేరుతో విపక్ష పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు అవసరమైతే ప్రధాని పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్దమనే సంకేతాలు ఇస్తోంది. దీంతో తటస్థ పార్టీలు కూడా కాంగ్రెస్ కూటమిలో భాగం కావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.

మరోవైపు.. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయేను నిలువరించేందుకు.. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 23న సోనియా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూపీయే భాగస్వామ్య పక్షాలతోపాటు తటస్థ పార్టీలను కూడా సోనియా ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల్లో.. టీడీపీతో పాటు వైసీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలను సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వచ్చిన వెంటనే తటస్థ పార్టీలను యూపీఏలోకి తెచ్చే ప్లాన్‌ చేస్తున్నారు. వివిధ పార్టీలతో కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్న కాంగ్రెస్.. టీఆర్ఎస్, వైసీపీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు ఆ రెండు పార్టీలకు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సోనియా సమావేశానికి ఈ రెండు పార్టీలకు ఆహ్వానం అందిందనే వార్తలు.. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. మరి ఫలితాల తరువాత టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు కాంగ్రెస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.