తెలుగు రాష్ట్రాలపై సోనియా ఫోకస్... పీసీసీ చీఫ్ ల ఎంపికపై కసరత్తు

 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునురుజ్జీవం కోసం ప్రయత్నిస్తోన్న ఏఐసీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియాగాంధీ.... తెలుగు రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర విభజనతో రెండు చోట్లా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని ఏదోవిధంగా బతికించుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేనప్పటికీ, గట్టి ప్రయత్నాలైతే చేయాలని సోనియా నిర్ణయించారు. అందుకే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఏపీసీసీ రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శైలజానాథ్, పల్లంరాజు, జేడీశీలం, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు పేర్లను సోనియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక, తెలంగాణ విషయంలో పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కోసం పోటీ ఎక్కువగా ఉండటం, మరోవైపు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, అలాగే అధిష్టానం పరిశీలనలో ఉన్న వ్యక్తులపై సీనియర్లు గుర్రుగా ఉండటంతో, పీసీసీ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగడం, ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు, అలాగే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగిసిన తర్వాత... తెలంగాణ పీసీసీ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి వార్ రూమ్ చర్చలు జరుపుతోన్న సోనియా... తెలుగు రాష్ట్రాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పట్నుంచే పార్టీని బలోపేతంచేసి, 2024లో అధికారం కైవసం చేసుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారట. అందుకే తెలంగాణలో ప్రజాసమస్యలపై నివేదిక ఇవ్వాలని సోనియా ఆదేశించారు.