తెలంగాణలో అధికారం.. ఏపీలో వైభవం

 

ప్రస్తుతం తెలుగు ప్రజల ఆలోచనలు తెలంగాణ రాజకీయాల చుట్టూనే తిరుగుతున్నాయి. దానికి కారణం త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే. టీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకుంటుందా? లేక మహాకూటమి అధికారంలోకి వస్తుందా? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, కూటమి పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అయితే ఇప్పుడు కూటమికి మేడ్చల్ లో జరిగిన భారీ బహిరంగ సభతో కొత్త ఉత్సాహం వచ్చింది. ముఖ్యంగా ఈ సభకు సోనియా గాంధీ రావడం కూటమికి కలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మీద అభిమానం ఉంది. తెలంగాణ తెచ్చింది మేమే అని కేసీఆర్ ఎంత చెప్పినా.. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని పలువురు అభిప్రాయం. కాంగ్రెస్ నేతలు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాకు కృతజ్ఞతలు చెప్పిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి కేసీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సోనియా గాంధీ తెలంగాణకు రావడంతో టీఆర్ఎస్ కి ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలిసారి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిన సోనియా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అయితే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా.. ఒకే సభలో ఇటు తెలంగాణ ప్రజలకు, అటు ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు.

సోనియా గాంధీ ఏం మాట్లాడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. దానికి తగ్గట్టే ఆమె ఉద్వేగంగా మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇన్నేళ్ల తరువాత తెలంగాణకు వస్తే తల్లి తన బిడ్డల దగ్గరకు వచ్చినట్లుంది అని చెప్పి తెలంగాణ మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు తెలంగాణ ఇస్తే రాజకీయంగా తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రం ఇచ్చామని గుర్తుచేసారు. కానీ పసిబిడ్డ లాంటి తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగా ఈ నాలుగేళ్లు అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను అభివృద్ధి చేసి.. ప్రజలు కోరుకున్న తెలంగాణగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఏపీ ప్రజలకు కూడా సోనియా గాంధీ భరోసా ఇచ్చారు. ఆంధ్ర ప్రజల జీవితాలు బాగుండాలని తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన రోజున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ ఈ వేదిక నుంచి వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేక హోదా సహా ఆ రోజు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాం అన్నారు. దీంతో ఇటు తెలంగాణలో పాటు అటు ఏపీ కూడా ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పారు. 

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగుతుంది. ఈ సభతో తెలంగాణ ఇచ్చిన వ్యక్తి సోనియా అనే విషయం ప్రజల్లోకి వెళ్తే అధికారం కూటమి వైపు ఎక్కువ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి అన్యాయం చేయడం.. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తామని హామీ ఇవ్వడంతో ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పోసుకుంటుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామని పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా సోనియా గాంధీ బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడం ఏపీలో ఆ పార్టీకి నూతనోత్సాహమనే చెప్పాలి. మరి సోనియా సభతో కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్టు తెలంగాణలో అధికారం, ఏపీలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.