మన సోనియమ్మకే పాపం ఎందుకు ఇన్ని కష్టాలు?

 

 

గల్లీ నుండి డిల్లీ వరకు కాంగ్రెస్ నేతలందరూ (సీమాంధ్రలో కొందరు తప్ప) సోనియమ్మకు గుళ్ళు గోపురాలు కట్టించి, దేవతలాగా పూజించుకొంటున్నారనే ఇంగితం కూడా లేని ప్రతిపక్షాలు ఆమెపై నీలాపనిందలు వేస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఏవో కుంటి సాకులు వెతికి పట్టుకొని ఆమె దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఆమె ఎంతగా నచ్చజెప్పుతున్నపటికీ ప్రజలు కూడా ప్రతిపక్షాల చెప్పుడు మాటలకు చెవోగ్గి ఒక్కో రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చేస్తున్నారు. ఇక పోనీ కదా అని పిలిచి యంపీ టికెట్స్ ఇస్తే కనీసం ఆ కృతజ్ఞతన్నది కూడా లేకుండా కొందరు కాంగ్రెస్ యంపీలు అవిశ్వాసం అంటూ డిల్లీలో చిందులేస్తున్నారు.

 

ఇక నిన్నగాక మొన్న పుట్టిన అమాద్మీ అయితే ఏకంగా తన చీపురు కట్టతో డిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసింది. అయినప్పటికీ పాపం ఆ తల్లి కొడుకులు పెద్దమనసుతో ఆ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడ్డారు. కానీ, వారి మంచి మనసులను, తేనె మనసులను ఏ మాత్రం అర్ధం చేసుకోలేని ఆమాద్మీ, “అయితే మేము కుర్చీలో కూర్చోన్నాక మీరు కప్పెట్టిన కుంభకోణాలను అన్నిటినీ త్రవ్వి తీస్తాము. మీకు ఓకేనా?” అంటూ తలతిక్క ప్రశ్న వేయడంతో వారి మనసులు ఎంత నొచ్చుకొన్నాయో ఎవరికి తెలుసు?

 

ఇక, ఈ నరేంద్ర మోడీ హటాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడ్డాడో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొడతామని, అరేబియా సముద్రంలో విసిరేస్తామని అవాకులు చవాకులు మాట్లాడుతూ పాపం! ఏ పాపం ఎరుగని ఆ తల్లి కొడుకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గుజరాత్ పక్కనే అరేబియా సముద్రం ఉంది గనుక తనకు సులువుగా ఉంటుందని ఆయన కాంగ్రెస్ పార్టీని అందులోకి విసిరేస్తానని శపథం చేస్తుంటే, ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళడం కష్టం గనుక మా పక్కనే ఉన్నబంగాళాఖాతంలోనే నిమజ్జనం చేసేస్తామని చంద్రబాబు, జగన్ బెదిరిస్తున్నారు.

 

అయిపటికీ సోనియమ్మ మాత్రం ఎలాగయినా వచ్చే ఎన్నికలలో గెలిచి తన రాహుల్ బాబును ప్రధానిగా చేసి ఈ దేశాన్నిఎలాగయినా కాపాడేయాలనే సత్సంకల్పంతో ఈ అజ్ఞాన జనాలనందరినీ పెద్ద మనసుతో క్షమించుకొంటూ ముందుకు సాగిపోతోంది ఆ మహా ఇల్లాలు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్నఈ ధ్వని కాలుష్యంతో ప్రజలు బెదిరిపోకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఎంత బిగ్గరగా భజన చేస్తున్నపటికీ, వారి భజన కంటే ప్రతిపక్షాల సౌండే ఎక్కువ క్లారిటీగా వినిపిస్తోంది జనాలకి. ఇప్పుడు ఈ సౌండ్ అమెరికాలో కూడా ప్రతిధ్వనించడం మొదలయింది.

 

ఇండియాలో అనేక కుంభకోణాలను అవలీలగా కప్పిపెట్టిన ఘనత గల కాంగ్రెస్ పార్టీకి, మూడు దశాబ్దాల క్రితం ఇందిరమ్మ హత్య జరిగినప్పుడు డిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన సంఘటనను మాత్రం ఇంకా పూర్తిగా కప్పిపెట్టలేకపోవడంతో అది బోఫోర్స్ భూతంలాగే నేటికీ కాంగ్రెస్ పార్టీని ఇంకా భయపెడుతూనే ఉంది. అయితే సోనియమ్మ సింహాసనం అధిరోహించక ముందు ఎప్పుడో జరిగిన సంఘటనలకు కూడా ఆమెనే తప్పు పట్టడం చాలా అన్యాయమని ఒప్పుకోకతప్పదు.

 

మన కోర్టులు, జనాలకయితే పోనీ ఎలాగోలా సర్ది చెప్పుకోవచ్చు. కానీ అమెరికా కోర్టులకి కూడా చెప్పుకోవడం అంత వీజీ కాదు. ఏ పాపం ఎరుగని సోనియమ్మే సంజాయిషీలు చెప్పకోవలసి రావడం, ఆమెకే కాదు ఆమె భక్తులకి కూడా చాలా నామోషీగా ఉంటుంది. అమెరికాలోని ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే పేరు పెట్టుకొన్నకొందరు దుర్మార్గులు పాపం! ఏ పాపం తెలియని దేవత వంటి మన సోనియమ్మపై అక్కడి యూ.యస్. ఫెడరల్ కోర్టులో కేసువేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఆనాడు అంటే ఇందిరమ్మ హత్య తరువాత డిల్లీలో వేలాది మంది అమాయకులయిన సిక్కులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన కాంగ్రెస్ నేతలకు, అందుకు సహకరించిన పోలీసు అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేటికీ పార్టీలో, ప్రభుత్వంలో పదవులు, పార్టీ టికెట్స్ ఉదారంగా పంచిపెడుతూ చట్టం తన పని తాను చేసుకు పోతుందని చిలక పలుకులు వల్లె వేయడం చాలా అన్యాయమని, రాహుల్ బాబు బాషలో చెప్పాలంటే ‘నాన్సెన్స్’ అంటూ ఏవేవో పిటిషనులో బరబరా గీకేసి ఆమెపై కేసు వేసి కక్ష సాధించాలని చూస్తున్నారు.

 

అమెరికా కోర్టులకి మనలాగా అసలు సెంటిమెంటులు ఉండవో ఏమో తెలియదు కానీ, ఆ మధ్య పాపం ఆమె క్యాన్సర్ వ్యాధికి ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వచ్చిందనే ఇంగితం కూడా లేకుండా, జనవరి రెండు లోగా సంజాయిషీ ఇచ్చుకోవలసిందే అంటూ ఆమె చేతిలో కోర్టు నోటీసులు పెట్టేసారు.

 

ఆమె మన దేశంలో ప్రధాని కుర్చీలో కూర్చోకపోయినా అటువంటిదే మరో కుర్చీ తన ఇంట్లో వేయించుకొని, ప్రధాన మంత్రిలాగ దేశాన్నిఎక్కడికో తీసుకుపోతున్నందుకు దేశంలో ప్రతిపక్ష పార్టీలకి అసూయపడుతున్నయంటే అర్ధం ఉంది. కానీ, ఎవరివో చెప్పుడు మాటలు విని అమెరికా కోర్టులు కూడా మన దేశానికి ప్రధానివంటి ఆ మహా ఇల్లాలుకి నోటీసులు జారీ చేయడం చాలా అన్యాయం. ఇక్కడ ఇల్లు కాలి ఆమె బాధపడుతుంటే, ఆమెపైకి ఈవిధంగా అమెరికా కోర్టులు కూడా నోటీసులు విసరడం ఏమయినా న్యాయంగా ఉందా? అదే మనం ఇరాక్ మీద బాంబుల వర్షం కురిపించిన జార్జ్ బుష్షు దొరమీదకో, నేటికీ పాకిస్తాన్ మీదకి ద్రోణులతో బాంబుల వర్షం కురిపిస్తున్న ఒబామాకో మనం నోటీసులు జారీ చేయగలమా? సంజాయిషీలు అడిగే సాహసం చేయగలమా? అటువంటప్పుడు పాపం! దేవత వంటి మన సోనియమ్మకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఇన్ని నీలాపనిందలు? ప్చ్!