సోనియా జీవితాన్ని మలుపు తిప్పిన క్షణాలు..

 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రీయాశీలక రాజకీయాల నుంచి తాను ఇక సెలవు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా సోనియా అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే సోనియా అనేంతగా ఎదిగిపోయారు సోనియా. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో.. కొత్త రక్తాన్ని ఎక్కించడంలోనూ ఆమె కృషి చేశారు. సోనియా హయాంలోనే పార్టీ అధికారాన్ని అనుభవించింది.. అధ: పాతాళానికి దిగజారింది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని అత్యధిక కాలం పాలించిన అధినేత్రిగా రికార్డుల్లోకి ఎక్కి.. నెహ్రూ కుటుంబం తప్ప కాంగ్రెస్‌కి మరో దిక్కులేదనే విశ్లేషకుల మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. ఆమె జీవితం ఎన్నో వింతలు, విషాదాల సమాహారం అవేంటో ఒకసారి పరిశీలిస్తే..

 

* సోనియా గాంధీ అసలు పేరు అడ్విగే ఆంటోనియా మాయినో..
* ఇటలీలోని లూసియానా దగ్గరలోని కంట్రడా మెయిని గ్రామంలో స్టిఫెనో, పోలా మైనో దంపతులకు 9 డిసెంబర్ 1946న జన్మించారు.
* సోనియా తండ్రి ఒర్బస్సానో అనే పట్టణంలో వ్యాపారం నిర్వహించడంతో ఆమె బాల్యం అక్కడే గడిచింది.
* 1965లో కేంబ్రిడ్జ్ నగరంలో ఆమె తొలిసారి రాజీవ్ గాంధీని కలిశారు.
* వీరిద్దరి పరిచయం, ప్రేమగా మారి.. 1968లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట వివాహం చేసుకున్నారు.
* 1984లో అమేధి నియోజకవర్గంలో రాజీవ్ తన మరదలు మేనకా గాంధీకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు.. సోనియా తొలిసారిగా రాజకీయ రంగంలోకి దిగి తన భర్త కోసం ప్రచారం చేశారు.
* 1997లో కలకత్తా ప్లీనరీ సమావేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సోనియా.. కేవలం 62 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.
* 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారి, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసి ఏకకాలంలో గెలిచారు. అయితే బళ్లారికి రాజీనామా చేసి.. అమేథీ నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను ఓడించారు. అదే సమయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
* 2004లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే ఒక విదేశీయురాలు ప్రధాని కావడానికి వీలు లేదంటూ బీజేపీ నిరసన చేపట్టడంతో.. ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ను ప్రతిపాదించారు. ఆమె మాత్రం 2004 నుంచి 2014 వరకు యూపీఏ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
* 2014లో తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించడంలో    సోనియా క్రీయాశీలక పాత్ర పోషించారు.
* 2011లో అమెరికాలో శస్త్రచికిత్సను చేయించుకుని.. తిరిగి ఇండియాకు తిరిగి వచ్చిన సోనియా గురించి పలు పుకార్లు వ్యాపించాయి. ఆమెకు క్యాన్సర్ సోకిందని.. న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.
* 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న సోనియా అస్వస్థతకు గురికావడంతో మధ్యలోనే తిరిగి వచ్చేశారు. సుమారు నెలకు పైగా ఆస్పత్రిలోనే గడిపారు.
* రాహుల్ గాంధీ ఇకపై కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తారని శ్రేణులకు తెలియజేశారు.