యూపీ ఉపఎన్నికల ప్రచారానికి మొహం చాటేసిన సోనియా, రాహుల్

 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజక వర్గాలకు సెప్టెంబర్ 13న జరగనున్న ఉపఎన్నికలకు అన్ని పార్టీలు భారీ ప్రచారం చేసేందుకు సన్నదమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉండేందుకు నిశ్చయించుకొన్నారు. అయితే అందుకు కారణాలు వారు చెప్పన్నప్పటికీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ తల్లి కొడుకుల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఘోరపరాభవం పాలయిందని అందరూ అభిప్రాయపడుతున్నందున, ప్రాంతీయ పార్టీల, బీజేపీ ప్రభావం అధికంగా ఉండే ఈ ఉప ఎన్నికలలో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే పార్టీలో తమ స్థానం మరింత క్రిందకు దిగజారుతుందనే భయంతోనే వారిరువురూ ఎన్నికల ప్రచారంలో పాల్గోవడం లేదని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.

 

కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మెకన్ బీజేపీ ఆరోపణలను త్రిప్పి కొడుతూ, “అయితే బీహార్, ఉత్తరాఖండ్ మరియు కర్ణాటకలో ఉపఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళలేదు? ఆయన ప్రచారానికి వెళ్ళకపోతే మేము ప్రశ్నించామా? అని ఎదురు ప్రశ్నించారు. ఆయన వాదన వినడానికి సొంపుగానే ఉన్నప్పటికీ, అదొక వితండవాదం అని అర్ధమవుతూనే ఉంది.

 

సోనియా, రాహుల్ గాంధీ ఇరువురూ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించారు కనుక ఆ పార్టీ ఓటమికి వారే బాధ్యులవుతారు. అదేవిధంగా బీజేపీని మోడీ గెలిపించారు కనుక ఆ ఖ్యాతి మొత్తం ఆయనకే దక్కుతుంది. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఒంటిచేత్తో గెలిపించి మోడీ తన సత్తా చాటి చూపారు. అందుకే ఆయన ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు. అందువల్ల ఆయన తన సత్తాను మళ్ళీ మళ్ళీ నిరూపించుకొనవసరం లేదు. కానీ, తను గాంధీ-నెహ్రూ వంశానికి చెందినందున ప్రధానమంత్రి పదవి తన జన్మహక్కు అని రాహుల్ గాంధీ భావించి భంగపడ్డారు. పార్టీకి నాయకత్వం వహించలేని వ్యక్తి ప్రధానమంత్రి అయిపోదామనుకోవడం అత్యాశే అవుతుంది. పార్టీ ఓటమి తరువాత దానికి గల కారణాలు విశ్లేషించుకొని, ఆయన మళ్ళీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టే బదులు, పూర్తిగా అస్త్ర సన్యాసం చేసేసి ఉత్తరకుమారుడు అనిపించుకొంటున్నారు. మళ్ళీ తల్లి సోనియాగాంధీయే పార్టీ భాధ్యతలను భుజానికెత్తుకోవలసి వస్తోంది. అందుకే ఆయనకు ఈ దెప్పిపొడుపులు తప్పడం లేదు. రాహుల్ గాంధీ రాజకీయాలలో రాణించలేనప్పుడు అందులోనే కొనసాగుతూ ఇంకా అవమానాలు పాలవడంకంటే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాగ రాజకీయసన్యాసం పుచ్చేసుకొంటే, ఆయనలాగే ఇక ఏ నిందలుపడకుండా హాయిగా కాలక్షేపం చేసేయోచ్చు కదా?