యువరాజ పట్టాభిషేకం

 

నిజంగా నువ్వు చాలా గ్రేట్ మమ్మీ!

 

ఏమిటి నువ్వు కూడా మన కాంగ్రెస్ నేతల్లాగే భజన చేస్తున్నావు? కొంపదీసి సహవాస దోషమా ఏమిటి?

 

బాగుంది.. యువరాజుని నేను భజన చేయడమేమిటి? నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయి మన పరువు పోయిందని మన కంటే ఎక్కువగా ప్రజలు, ప్రతిపక్షాలే మనకి గుర్తుచేసి మనల్ని ఏడిపిస్తుంటే వాళ్ళని లోక్ పాల్ బిల్లుతో భలే మాయ చేసావు మమ్మీ. నిజంగా యువార్ గ్రేట్ మమ్మీ! ఈ వెర్రి జనాలు అప్పుడే ఆ సంగతి మరిచిపోయి, లోక్ పాల్ బిల్లుని చూసి ఎలా చంకలు కొట్టుకొంటున్నారో చూస్తే నవ్వాపుకోలేక పోతున్నామమ్మీ! పైగా మనోళ్ళు అందరూ అది నా గొప్పదనమేనని ఓ..కోరస్ గా ఒకటే భజన చేసేస్తుంటే..నాకు కూడా మొన్న ఎన్నికలలో ఓడిపోయిన దుఃఖం పూర్తిగా పోయింది మమ్మీ! రియల్లీ యువ్వార్ గ్రేట్ మమ్మీ!

 

ఒరేయ్!కన్నా ఇక ఆపరా ఆ భజన రోజూ మనవాళ్ళ భజనలు వినివినీ చెవులు చిల్లులు పడిపోతుంటే ఇక నువ్వు కూడా తయారయ్యావా?

 

ఏమిటి మమ్మీ నేను నీ ట్రిక్ చూసి చాలా థ్రిల్ అయిపోయి ఆనందం పట్టలేక చెపుతుంటే భజన అని అలా తీసి పారేస్తావు?

 

ఆ పోనీలే..కోప్పడకు.. అయితే ఇంతకీ ఏమంటావు? నేను గ్రేట్ అంతేనా?

 

యస్ మమ్మీ! యువ్వార్ రియల్లీ గ్రేట్! టెర్రిఫిక్.. లేకుంటే ఇంతవరకు మనం తయారుచేసిన లోక్ పాల్ బిల్లు ఒట్టి వేస్ట్ అంటూ మనల్ని తిట్టి పోసిన ఆ అన్నాహజారే చేతే మన “కాంగ్రెస్ పార్టీయే లోక్ పాల్ బిల్లు కోసం చాలా శ్రమ పడింది. అందుకు పార్టీకి చాలా థాంక్స్” అని కూడా చెప్పించావు. అందుకే యువ్వార్ రియల్లీ ఎక్సట్రార్డినరీ పర్సన్న్..అని నేను అంటుంటే నువ్వేమో భజన అంటూ తీసి పారేస్తున్నావు.

 

ఏమిటో రా.. మీ డాడీ పోయినప్పటి నుండి ఈ భజనలు వినివినీ ఉన్నమాట చెప్పినా కూడా నాకు భజనలాగే వినిపిస్తోంది. అయినా ఒకటి గుర్తుంచుకో జనాలు అడిగారని ఏదీ వెంటనే ఇచ్చేయకూడదు. వాళ్ళు మనల్ని బ్రతిమాలుకొని, తిట్టుకొని ఇక వల్ల కాదనుకొంటున్నప్పుడే ఏదయినా ఇవ్వాలి. ఇది కూడా అంతే.అప్పుడు మనం ఇచ్చిందే గొప్పనుకొని ఆ తిట్టిన నోళ్ళతోనే మనకి భజనలు చేస్తారు.. ఇంకా భక్తి ఎక్కువయిపోతే  మనకి గుళ్ళు గోపురాలు కూడా కట్టి పూజిస్తారు. నువ్వు కూడా ఇటువంటి ట్రిక్స్ నేర్చుకోకపోతే ఇక దేశాన్ని ఎలా పాలిస్తావు? ఈ ప్రతిపక్షాలని, ప్రజలని ఎలా మేనేజ్ చేస్తావురా కన్నా... నువ్వు చూస్తే ఎప్పుడూ పార్టీ ప్రక్షాళన, రాజకీయ ప్రక్షాళన, దేశం, యువత, అభివృద్ధి అంటూ ఏవేవో మనకి అలవాటులేని మాటలన్నీ మాట్లాడుతుంటావు తప్ప.. మన మోహన్ అంకుల్ కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడవు. ఇలాగయితే ఎలారా కన్నా? మళ్ళీ ఆ మోడీ అంకుల్ ఆ కుర్చీలో ఒకసారి సెటిల్ అయిపోతే ఇక అతనిని అందులోంచి లేపడం ఇక ఎవరి తరమూ కాదు..ముందే చెపుతున్నాను... జాగ్రత్తపడు. ఆ..

 

ఏమిటి మమ్మీ నేను మరీ అంత మొద్దబ్బాయిలా కనిపిస్తున్నానా నీకు కూడా? నాకు మాత్రం ఆ కుర్చీలో కూర్చోడం ఇష్టం లేకనే అలా మాట్లాడుతున్నానంటావా? నేను వద్దని అంటుంటే వాళ్ళు నాకు అసలు పదవీ వ్యామోహం లేదని ఎలాచెప్పుకొంటున్నారో ఎప్పుడయినా విన్నావా? ఈ జనరేషన్ గ్యాప్ వలన నువ్వు నా కాన్సెప్ట్ సరిగ్గా క్యాచ్చ్ చేయలేకపోతున్నావు మమ్మీ. పోనీ... నీ కాన్సెప్ట్ ప్రకారం ఇద్దరం కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగినా ఒక్క రాష్ట్రంలో గెలిచామా చెప్పు? ఇప్పుడు జనాలకి ఇష్టమయిన నాలుగు మాటలవే..కావాలంటే ఓసారి ఏ ఫేస్ బుక్కులోకో ట్వీటర్లోకో వెళ్లి చూడు నీకే అర్ధం అవుతుంది నేను చెపుతున్న మాటలే జనాలు బాగా లైక్ చేస్తారని.

 

అవునురా కన్నా... నువ్వు చెప్పిందే నిజమనుకో.. అయినా ముసలి దాన్నయిపోతున్నాను కదా...నాకా ఫేస్ బుక్కులు అవీ ఏమి తెలుస్తాయి చెప్పు...బహుశః అలాంటి మాయ మాటలు చెప్పే ఆ చీపురు పార్టీ వాళ్ళు డిల్లీలో జనాలని తమ బుట్టలోపడేసుకొన్నారు. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేకుండా పోయాయిరా అబ్బాయ్! లేకుంటే 15ఏళ్ల నుండి మనం కారులోంచి కాలు క్రింద పెట్టకుండా కనుసైగ చేస్తే వచ్చి ఓటేసే డిల్లీలో జనాలు ఎవరో చీపురు పట్టుకొని వచ్చి ఓటేయమని అడిగితే వాళ్ళకీ ఓటేసేయడమే.. బుర్ర బుద్దీ లేకపోతే సరి!

 

పోనీలే..నువ్వు కూడా వచ్చేఎన్నికలలోగా జనాలకి బాగా ఎక్కే ఆ నాలుగు మంచి ముక్కలు మాట్లాడటం నేర్చుకో...

 

అప్పుడెప్పుడో మీ నాయనమ్మ కూడా ఇలాగే ఈ జనాలు తిక్కతిక్కగా వ్యవహరిస్తుంటే ‘గరీబీ హటావ్’ అంటూ ఓసారి గెలిచింది. ఏవో ఇరవయ్యో, ముప్పయ్యో సూత్రాలంటూ మరోసారి గెలిచింది. నువ్వు కూడా అలాంటివే ఏవయినా నేర్చుకోరా.. బాబు! ఓసారి నువ్వా మన్మోహన్ అంకుల్ కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటె మన జనాలు నీకు కూడా భజనలు, స్తోత్రపాటాలు చదువుతుంటే చూడాలని ఉందిరా కన్నా. ఆ ఒక్కటీ సాధించు చాలు..మరి నాకింకేమీ అక్కరలేదు.

 

స్యూర్ మమ్మీ... ఐ విల్ ట్రై మై బెస్ట్..బట్ ఆంటిల్ దెన్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అండ్ సప్పోర్ట్ మమ్మీ..

 

ఓ.. వైనాట్ బేటా..నేనేమిటి.. మన కాంగ్రెస్ గ్యాంగ్ అంతా నీ వెనుకే ఉంటారు.. ప్రొసీడ్..