బీజేపీ ప్లాన్ ఇదేనా.... చంద్రబాబు ఉంటే హోదా ఇవ్వం...


సోము వీర్రాజు..ఈయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమధ్య మీడియా సమావేశాల్లో ఈయన హడావుడి ఎక్కువైంది. మైకు కనిపిస్తే చాలు.. నోటికొచ్చినట్టు మాట్లాడటం..ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ-టీడీపీ మిత్ర పక్షాలుగా ఉన్నప్పుడు కూడా ఈయన తన నోటికి తాళం వేయకుండా టీడీపీపై విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు బీజేపీ నుండి టీడీపీ బయటకు వచ్చిన తరువాత... ఇంకా ఎక్కువ విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎన్నో కామెంట్స్ చేసిన ఆయన తాజాగా మరోసారి  ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో అవినీతి పరాకాష్టకు చేరిందని, ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు సరిపోదని, బుల్డోజర్ కావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కాని.. మట్టి నుంచి ఇసుక వరకు, పోలవరం నుంచి పట్టిసీమ వరకు రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతికి ‘పట్టిసీమ’ పరాకాష్ట అని, రూ.1120 కోట్లతో ‘పట్టిసీమ’ మొదలైందని, ఇప్పుడు రూ.1667  కోట్లకు వెళ్లిందని అన్నారు. పట్టిసీమలో ఏర్పాటు చేసిన మోటార్లు 30 అని చెప్పారని, కేవలం 24 మోటార్లు మాత్రమే పెట్టారని, పంపు సెట్ల ఖరీదులోనూ మతలబు ఉందని ఆరోపించారు.

 

అంతేకాదు... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం హోదా ఇచ్చే ప్రసక్తే లేదని .. అరుణ్‌ జైట్లీ సూచించినట్లు ‘స్పెషల్‌ స్టేటస్‌ వెహికల్‌’ ఏర్పాటు చేస్తే.. హోదా హామీ ద్వారా ఏపీకి దక్కాల్సిన అన్నిటికి అన్ని మేళ్లూ అందుతాయని, ఈ విషయంలో బీజేపీపై ఎలాంటి అనుమానాలు అవసరంలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని ఆరోపించారు. చూడబోతే నిజంగానే చంద్రబాబుకు క్రెడిట్ దక్కకుండా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం హోదా ఇచ్చే ప్రసక్తే లేదు అని రాజుగారు అంత ఖచ్చితంగా చెబుతున్నారంటే అందులో నిజం లేకపోలేదు అని అనుకుంటున్నారు. దీనిబట్టి చూస్తే ఏదో హంగామా చేసి తమవల్లే హోదా వచ్చిందని చెప్పుకోవాలని బీజేపీ చూస్తున్నట్టు అర్దమైపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో..