కన్నాకి పదవి.. అజ్ఞాతంలోకి సోము..వాట్ నెక్ట్స్

 

గత కొద్దికాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షపదవిలో ఎవరిని నియమించాలో బీజేపీ పెద్దలు చర్చలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ రేసులో మాణిక్యాలరావు, సోమువీర్రాజు, కన్నాలక్ష్మిణారాయణల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వారి ముగ్గురిలో మాణిక్యాలరావువైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. ముందు సోమువీర్రాజు నే అనుకున్నా.. ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని.. అందుకే దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అయితే కరెక్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ... మళ్లీ బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పురుంధరేశ్వరి పేరు కూడా తెరపైకి వచ్చింది. అలా చర్చించిన కొన్ని రోజుల తరువాత మళ్లీ సోము వీర్రాజుకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకున్నారు. ఇక కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత అసంతృప్తి చెందిన కన్నా లక్షీ నారాయణ వైసీపీ చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక రేపో మాపో కన్నా వైసీపీలో చేరుతారు అనుకునే లోపు.. అమిత్ షా నుండి ఫోన్ రావడం... ఆ తరువాత అనారోగ్యం అని ఏదో సాకు చెప్పి పార్టీ మార్పుకు బ్రేక్ చెప్పారు. ఇక ఇప్పుడు హఠాత్తుగా మళ్లీ ఆయనను పార్టీ చీఫ్‌గా చేశారు. నాడు పార్టీ చీఫ్‌గా చేయనందుకే ఆయన వైసీపీలోకి వెళ్లాలని భావించారని, కానీ అధిష్టానం నుంచి హామీ వచ్చాక ఆగిపోయారని, ఇప్పుడు ఆయనకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.

 

ఇక ఇప్పుడు బీజేపీ అధిష్టానం కన్నాకు ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఓ మనిషి అలక పూనినట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు...సోము వీర్రాజు. ఆ పదవి తనకు దక్కుతుందనుకున్న సోము వీర్రాజు పాపం నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది.  పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న తనను కాదని, రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన మనస్తాపం చెందారట... ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఎనిమిది గంటల సమయం నుంచి ఆయన అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. మరోవైపు కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు... సోము వర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. తమ నేత వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. రాజీనామా పత్రాలను జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు పంపినట్టు తెలిపారు. మరి దీనిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో.. సోము వీర్రాజును ఎలా బుజ్జగిస్తారో చూడాలి..