TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోముది ఆత్మ విశ్వాసం కాదు.. అతి విశ్వాసం !

Published on: Sun May 8, 2022 10:19PM

పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ వెళ్లి మరీ రాలేనని చెప్పిందటో పెద్ద ముత్తయిదవ. అలా ఉంది ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు. ఏపీలో బీజేపీ ఉనికే నామమాత్రం. ఆ పార్టీ రాష్ట్రంలో సొంతంగా కనీసం ఒక్క స్థానంలోనైనా గెలిచే పాటి బలం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల మాత్రమే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులకు మాట్లాడేందుకు ఆ మాత్రమైనా అవకాశం వస్తున్నది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా కాంగ్రెస్, బీజేపీలకు వచ్చిన ఓట్లు, సీట్లు దాదాపు శూన్యమనే చెప్పవచ్చు. 2014 ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఆ స్థానాలు కూడా తెలుగుదేశంతో పొత్తు కారణంగానే తప్ప సొంత బలం ఇసుమంతైనా కాదు. 2019 ఎన్నికలలో ఆ పార్టీ తరఫున నిలబడిన వారెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. 2019కు ఇప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదనడంలో సందేహం లేదు.

అయితే రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా తమ మద్దతు లేకుంటే సాధ్యం కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు. సోము వీర్రాజైతే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ తమ పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించి సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ కు గురయ్యారు. 
ఇంతకీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పై పోరాటాలకు అందరూ కలిసి రావాలనీ, అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని.. దీనిని సోము వీర్రాజు బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారన్నట్లుగా వ్యాఖ్యానిస్తూ..పొత్తుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేడపతామని కూడా ఘనంగా ప్రకటించేశారు.

ఆయన మాటలు రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు.  రాజకీయ నాయకులలో ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ.. సోము వీర్రాజుకు ఉన్నది ఆత్మ విశ్వాసం కాదనీ అతి విశ్వాసమనీ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం అధినేత పొత్తు గురించి, కలిసిరావాలంటూ చేసిన ప్రతిపాదన జన సేన పార్టీని ఉద్దేశించి అన్నది అందరికీ తెలిసిందే. ఒక వేళ జనసేన టీడీపీల మధ్య పొత్తు కలిసినా బీజేపీని కలుపుకుంటారా లేదా అన్నది డౌటే..  బీజేపీకి రాష్ట్రంలో ఉన్న పరపతి, పట్టు బలం ఆధారంగా చూస్తే పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే మూడు నాలుగు స్థానాలను కోల్పోవడం తప్ప  మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు.