TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధికారి ఆయనే.. అధికారం మాత్రం ఆమెది!

Published on: Tue Mar 11, 2025 4:22PM

రోజులు మారి పోతున్నాయి. మనుషులు మారి పోతున్నారు. విలువలు జారిపోతున్నాయి. ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు ఇంకా వేగంగా మారిపోతున్నాయి. మరి, ఆకాశం లో సగంగా ఉన్న మహిళలూ కాలంతో పాటే అన్నట్లు  ఇంకో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇంకా ఎంత కాలమని  వంటింటికే పరిమితం అనుకుంటున్నారో ఏమో, పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఏపీలో ప్రభుత్వ అధికారుల శ్రీమతులు కొందరు, అధికారం లో కి వచ్చిన నేతల ధర్మపత్నులు ఇంకొందరు అక్రమ వసూళ్ల కు నడుం బిగించారు. మాకు గోడలు లేవు అంటూ స్వయం ఉపాధి లాగ రంగంలో దూసుకు పోతున్నారు. భర్త హోదా, అధికారమే పెట్టుబడిగా  కుటుంబ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు.

 డబ్బు సంపాదించడం ముఖ్యం కానీ, ఎలా అన్నది కాదు కదా? అయినా, అవినీతి ఇప్పుడే పుట్టిందా ..ఏంటి? అన్నట్టు ఉంది వారి తీరు. అవును. అవినీతి ఎప్పుడు, ఎక్కడ. ఎలా  పుట్టిందో ఏమో కానీ, ఇప్పడు అవినీతికి ఎల్లలు లేవు. హద్దులు,సరిహద్దులు అసలే లేవు. అవినీతి సర్వాంతరయామి. ఇక్కడ వుంది, అక్కడ లేదు అన్న సదేహం లేకుండా విశ్వం అంతటా వ్యాపించింది. భగవంతుడు ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు,(ఇందుగలడందు లేడని/సందేహము వలదు చక్రి సర్వోపగతుండు) అంటాడు ప్రహ్లాదుడు. అందుకే వారు డబ్బు లోనే పరమాత్మ ను వెతుక్కుంటున్నారు.అవినీతి విషయంలో మాత్రం అలాంటి సందేహం అస్సలు అవసరం లేదు. అంతటా వుంది. అన్నిటా వుంది.  సందేహం లేదు. నిజానికి,  ఇప్పడు కాదు, ఎప్పుడోనే, స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ , Corruption is an international phenomenon, ‘విశ్వ  లక్షణం’, విశ్వం అంతటా వుంది, మన దేశంలోనూ వుంది, ఉంటుంది, అంటూ’ అవినీతి విశ్వ రూపాన్ని వివరించారు. అంతేకాదు, అవినీతి గురించి, చొక్కాలు చింపుకోవద్దని, విపక్షాలకు జ్ఞాన బోధ కూడా చేశారు. 

ఇందిరమ్మ ఇచ్చిన భరోసాతోనో  ఏమో, ఆనాటి నుంచి మన దేశంలో అవినీతి, ఇంతింతై వటుడింతై  అన్నట్లు   పెరిగిపోతూనే వుంది. ఎసీబీలు, సిబిఐ,ఈడీ ఇంకా.. ఇతర అవినీతి నిరోధక శాఖలు, అవినీతి వ్యతిరేక చట్టాలు, ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేసే   న్యాయ వ్యవస్థ, ఎన్నున్నా, ఏమి చేసినా, ఆకులు వేసే వారు వేస్తుంటే, తీసేవారు తీస్తున్నారు అన్నట్లు ఎవరి  ‘పని’ వారు చేసుకు పోతున్నారు. అంతే కాదు, ఆరు నెలలు  స్నేహం చేస్తే వారు వీరవుతారు అన్నట్లు  న్యాయవ్యవస్థ సహా అవినీతి నిరోధక వ్యవస్థలు అన్నిటికీ కూడా అవినీతి సోకిందని,పాకిందని కథలు వింటున్నాం. అయ్య గారు చెయ్యక పోతే అమ్మ గారు చేస్తారు గా అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. కావలసినదంతా ఒక్కటే, చేతిలో శాలువాలు, దేవుడి ప్రసాదం, ఆశీర్వచనాలు చెప్పే పంతులుగారు పక్కన ఉంటే , డబ్బు సంచి తేలిగ్గా చేతులు మారి పోతుంది. గత ప్రభుత్వం లో ఈ పద్ధతి బాగా పని చేసింది అంటున్నారు. కంచే చేను మేసిన కథలు అనేకం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం.

అంతే కాదు, ఒకప్పడు లంచం అంటే ఏదో చాటు మాటు వ్యవహారంగా సాగేది. కిందిస్థాయి ఉద్యోగులు, వేడి నీళ్ళకు చలి నీళ్ళు’ అన్నట్లు బల్ల కింద చేతులు పెట్టి పదీ పరక పుచ్చుకోవడం ఉండేది. అందులోనే, అంతో ఇంతో పై అధికారుల చేతులు తడపడం ఉంటే ఉండేదేమో. నిజంగానే, అప్పట్లో ఇందిరా గాంధీ అన్నట్లుగా, ఇప్పుడు అదో పెద్ద సమస్య కాదు. అందుకే, అప్పట్లో సినిమాల్లోనూ, లంచాలు ఇచ్చి పుచ్చుకోవడాలు కామెడీ ట్రాక్ కు మాత్రమే పరిమితంగా ఉండేది.అలా కామెడీ, ట్రాక్ కు మాత్రమే పరిమితం అయిన లంచావతారాలు తర్వాత తర్వాత టైటిల్’ రోల్  కి చేరుకున్నాయి. దాసరి  నారయణ రావు, ఏకంగా ‘లంచాచాతరం’ టైటిల్ తో ఫుల్ లెంగ్త్ సినిమానే తీశారు. అలాగే, అవినీతిని ఎండగడుతూ, సమాజాన్ని చైతన్య పరిచే ప్రయత్నంలో భాగంగా ఠాగూర్ , భారతీయుడు , అపరిచితుడు వంటి సినిమాలు వచ్చాయి. సినిమాల దారి సినిమాలది అవినీతి దారి అవినీతిది అన్నట్లు రియల్ స్టోరీ నడుస్తోందనుకోండి అది వేరే విషయం. 

అదెలా ఉన్నా ఇప్పడు అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. మంత్రుల పేషీలు, ఐఎఎస్  చాంబర్లు దాటి, ఉన్నతాధికారుల వంటిటికీ చేరింది. అవును. ఆంధ్ర ప్రదేశ్ లో అందరూ కాదు కానీ,కొందరుసీనియర్ అధికారులు, నిండా మునిగినాక చలేమిటి,అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన  అవినీతి అరాచకత్వం,ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గతంలో చేసిన తప్పులకు కొందరు ఐఎఎస్ అధికారులు కేసులు ఎదుర్కున్నారు. అందులో కొందరు  జైలు ఊచలు లెక్క పెట్టారు. అయినా, ఆ ఐఎఎస్ ల తీరు మారలేదు. ఇప్పడు అధికారుల అవినీతికి సంబంధించి వస్తున్న చిత్ర విచిత్ర కథలు, కథనాలు  విస్మయానికి గురిచేస్తున్నాయి. 

అన్నిటినీ  మించి కొందరు అధికారుల అవినీతిని  ఫ్యామిలీ బిజినెస్ గా మార్చేశారు. ఇంకొందరు అధికారుల భార్యలు, తమ భర్త   హోదా  పెట్టుబడిగా, హోటళ్ల లో మీటింగ్లు పెట్టి , స్వయం ఉపాధి లాగా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఏకంగా   ఏ పనికి ఎంత రేటన్నది ఫిక్స్ చేసి, రేట్ కార్డు ప్రకారం, పనిచేస్తున్నట్లు జనం కథలు కథలుగా  చెప్పుకుంటున్నారు. నియంత్రించాల్సిన పాలకులే ఎన్నికల్లో పోయిన సొమ్ము రాబట్టు కునే పనిలో ఉంటే , దీనికి అడ్డు చెప్పేవారు ఎవరు?  సీట్లు, ఓట్లు కోసం కోట్లు ఖర్చు పెట్టి చేతులు ముడుచుకుని కూర్చుంటే రేపటి పరిస్థితి ఏమిటి? అని ఓపెన్  గానే ప్రశ్నిస్తున్నారు. మంచి పోస్టులు కోసం అధికారుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్న నేతలు మాత్రం ఏమి అదుపు చేస్తారు? ఎవరిని చేస్తారు? కంచే చేను మేస్తుంటే, మిగతా వారు దూడలు గా మారి పోరా?  అవినీతి కొత్త కాదు కానీ , మార్గాలే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రేపటి కోసం ఏం చేయగలం.