TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భరత్‌ తివారీ ఎన్‌కౌంటర్... బీహార్‌లో రాజకీయ దుమారం

Published on: Tue Jun 23, 2026 6:50PM

 

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28)  పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం,  రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. భరత్ లొంగిపోయినా, నిరాయుధుడైన తర్వాతే పోలీసులు కాల్చి చంపారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తుండగా, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.  జూన్ 17, 2026న భోజ్‌పూర్ జిల్లాలోని బిలౌటి గ్రామంలో పోలీసులు, భరత్ తివారీ మధ్య జరిగిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో మరణించారు. 


భరత్ తివారీ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని, అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై అతనే ముందుగా కాల్పులు జరిపినట్లు పోలీసులు అంటున్నారు. భరత్ తివారీ లొంగిపోయి, తన వద్ద ఉన్న ఆయుధాన్ని పక్కన పడేసిన తర్వాతే పోలీసులు కాల్పులు జరిపారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూపిస్తూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భరత్‌తివారీ ఎన్‌కౌంటర్‌తో పెరుగుతున్న ప్రజా ఆగ్రహంతో బీహార్ ప్రభుత్వం నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విచారణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర  కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర దర్యాప్తు జరపాలని మరియు దోషులైన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

భరత్ తివారీ స్థానిక సమస్యల కోసం నిలబడే కార్యకర్త అని స్థానికులు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసు సిబ్బందిని సోషల్‌మీడియాలో బెదిరించేవాడన్న ఆరోపణలున్నాయి.  2026 జూన్ 15న, భరత్ తివారీ తాను ఈ దేశంలో ఒక విప్లవ యుద్ధం ప్రారంభించబోతున్నట్లు ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు పెట్టాడు. అలాగే జగదీష్‌పూర్ ఎస్‌డిఎమ్‌ను చంపుతానని బెదిరించాడన్న ఆరోపణలున్నాయి. అప్పుడే పోలీసు శాఖకు చెందిన ఇద్దరు అధికారులు తివారీ నివాసానికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో అతను ఇంట్లో లేడు. ఆ రోజు అతను పోలీసుల ఎదుట కూడా హాజరు కాలేదు. ఆ క్రమంలో జూన్ 16న ఒక వ్యక్తి ఆయుధాలు కలిగి ఉండి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడని షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. 

బిలౌతి గ్రామంలో నివసించే భరత్ భూషణ్ తివారీని సదరు అనుమానితుడిగా గుర్తించారు.
భరత్‌ను ప్రశ్నించడానికి పోలీసులు అతని నివాసానికి చేరుకున్నప్పుడు, అతని వద్ద  తుపాకీ ఉంది. అతను ఫేస్‌బుక్ లైవ్‌లోకి వెళ్లి అధికారులతో మాట్లాడాడు. ఆ ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో, దానికి సంబంధించిన పోస్టులలో, ఎన్‌కౌంటర్ ద్వారా తనను చంపడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భరత్ ఆరోపించాడు. అధికారులు తనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారని పేర్కొంటూ, వ్యవస్థకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. 

సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు విస్తృతంగా షేర్ అవుతున్న నేపథ్యంలో, భరత్‌ మానసికస్థితిపై అనుమానంతో, మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు తరలించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని,  భోజ్‌పూర్ పోలీసులు సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. అతని వద్ద ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు  ప్రకటించారు.

అదే సమయంలో భరత్ మళ్లీ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి, తనని తాను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటూ, పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపధ్యంలో భరత్‌ ఉన్న చోటుకు చేరుకుని, లొంగిపోమని  కోరినప్పటికీ భరత్ కాల్పులు కొనసాగించాడని బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా పోలీసులు నివేదించారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపటడంతో గాయపడ్డాడు.. పాట్నాలో ఉన్న పి.ఎం.సి.హెచ్‌లో చికిత్స పొందుతూ అతను మరణించాడు. భరత్ తివారీ మరణంతో బీహార్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్  భరత్ తివారీ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని డిమాండ్ చేస్తున్నారు.