వేళ్ల అంచుల్లో కొత్త వ్యసనం...విషాదమే పర్యవసానం...

 

ఫేస్బుక్,ట్విట్టర్,వాట్సప్,ఇన్ స్టాగ్రామ్ వగైరా వగైరా...ఇవి లేకుండా ప్రపంచాన్ని ఇప్పుడు మనం ఊహించలేం.పొద్దున్న లేస్తే వాష్ రూంలోకి వెళ్లి వచ్చిన విషయం మొదలు గుడ్ నైట్ చెప్పేసి...ఇక పండుకుంటున్నా...అనేంత వరకూ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం చాలా మందికి మామూలైపోయింది.ఒకవేళ ఏ కారణంతోనైనా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లన్నీ వారం రోజులు అందుబాటులో లేకపోతే ఎంత మందికి పిచ్చేక్కేస్తుందో!


మందు,సిగరెట్,గుట్కా లాంటి వ్యసనంగా మారిపోయింది ఇంటర్నెట్ కూడా.మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో టైంపాస్ చేయటం కోట్ల మందికి దురలవాటుగా మారిపోయింది.దీని వల్ల విలువైన సమయం వృథా కావటమే కాదు ఇంకా అనేక నష్టాలు నెత్తిన పడుతున్నాయి.అసలు సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాలే పోతున్నాయంటే ఎవరైనా షాకవుతారు.కాని,ఇది ఇప్పుడొక ఆధునిక నిజం. 


పూణేలో ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన భార్యని గొంతు నులిమి చంపేశాడు.తరువాత తాను కూడా ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.కారణం ఫేస్బుక్కే!అందులో తన భార్య విపరీతంగా పర్సనల్ విషయాలు పంచుకుంటోందని అతడి ఫ్రస్ట్రేషన్.బహుశా చాలా సార్లు ఆ విషయం ఆమెకు చెప్పి కూడా వుండవచ్చు.అయినా 28ఏళ్ల ఆ మాజీ ఐటీ ఎంప్లాయి వినలేదు.సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత విషయాలు విచ్చలవిడిగా బయటపెట్టింది.ఉన్మాదానికి,ఆవేశానికి లోనైన 34ఏళ్ల భర్తకి హత్య,ఆత్మహత్య తప్ప మార్గం కనిపించలేదు!


భార్య చేసిన పొరపాటుకి ఆ భర్త విధించిన శిక్ష అస్సలు సమర్థనీయం కాదు.కాని,తాను కూడా ప్రాణం తీసుకున్న అతనిపై పడ్డ ఒత్తిడి గురించి మనం ఆలోచించాలి.సొషల్ మీడియా వినియోగం హద్దులు దాటితే జీవితాలు ఎలా ఛిద్రం అవుతాయో గ్రహించాలి.ఫేస్బుక్,ట్విట్టర్ లాంటివన్నీ మాయా,భ్రమ.అక్కడి మనుషులు,మాటలు,భావాలు ఏవీ నిజం కాదు.ఇంటిలో వున్నట్టుగా ఇంటర్నెట్లో జనం వుండరు.అందంగా వుంటారు.తియ్యగా మాట్లాడతారు.కాని,ఆ నటన వెనుక హిపోక్రసీ దాగుంటుంది.అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియా కోసం ఫ్యామిలీని,రియల్ ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవద్దు.కాని,ఇప్పుడు చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లు,స్మార్ట్ ఫోన్లకు హతుక్కుపోయి అదే చేస్తున్నారు...


ప్రకృతిలో సహజంగా వచ్చే అన్నమే తక్కువగా తింటే ఆకలేస్తుంది!ఎక్కువగా తింటే ఆయాసం కలుగుతుంది!ఇక కృత్రిమమైన సోషల్ మీడియా లాంటి ఆకర్షణలకి లోనైతే చెప్పేదేముంది?వాట్ని వాడకపోతే మనం వెనకబడిపోతాం.ఎక్కువగా వాడితే పాడుబడిపోతాం.అందుకే,నెట్ వర్కింగ్ సైట్స్ ని మనం మన అవసరం మేరకే వాడుకోవాలి.వాటికి ఆవల వున్న నిజమైన ప్రపంచాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పణంగా పెట్టకూడదు...