నిను వీడని నీడ – సోషల్‌ మీడియా

ఓ చిన్న ప్రయోగం చేసి చూద్దామా! ఓ నాలుగు గోడల మధ్య కూర్చుని మీ జీమెయిల్‌ అకౌంట్‌ ఓపెన్ చేయండి. ఆ అకౌంట్ అలా ఓపెన్ చేసి ఉండగానే గూగుల్‌ సెర్చ్‌లో ఏదో ఒక విషయం గురించి సెర్చ్‌ చేయండి. ఇప్పుడు ఏదన్నా ఇంటర్నెట్‌ సెంటర్‌కి వెళ్లి కూర్చోండి. అక్కడ మీ జీమెయిల్‌ అకౌంట్ ఓపెన్ చేయండి. అలా చేసి ఉండగానే గూగుల్‌ సెర్చ్‌ చేసే ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు మీరు రహస్యంగా సెర్చ్‌ కొట్టిన కీవర్డ్స్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద కనిపించడం ఖాయం. ఇదేమీ మాయా కాదు మంత్రమూ కాదు. గూగుల్‌ తల్లి నిరంతరం మిమ్మల్ని గమనిస్తోంది అని చెప్పే సూచన మాత్రమే!


గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వెబ్‌సైట్లు తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడతామని చెబుతూనే వారిని వేయి కళ్లతో గమనిస్తూ ఉంటాయి. మీరు అమెజాన్‌లో ఓ పుస్తకం చూసి ముచ్చటపడితే, గూగుల్‌ తల్లి మీరు ఎక్కడకి వెళ్లినా అదే పుస్తకాన్ని చూపిస్తూ ఊరిస్తూ ఉంటుంది. ఇలా ఇంటర్నెట్ వాడకందారుల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోతున్నాయంటూ ఆందోళనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అయితే కేవలం గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి వెబ్‌సైట్లే కాదు కాస్త పెద్ద సంస్థ ఏదైనా సరే, మనల్ని అంతర్జాలంలో వెంబడించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


ఆస్ట్రేలియాలోని కొందరు పరిశోధకులు కలిసి మన వ్యక్తిగత వివరాలు ఎంతవరకు సురక్షితం అనే విషయం మీద ఓ అధ్యయనం చేశారు. ఇందుకోసం వారు కొన్ని కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను రూపొందించారు. వాటి ద్వారా ఒక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించేవారి తీరుని పట్టేయవచ్చునంటున్నారు. వీరి అంచనా ప్రకారం ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నట్లే వాళ్లు వెబ్‌సైట్లని చూసే తీరులో కూడా ప్రత్యేకత ఉంటుంది. అమెజాన్‌లో సైన్సు పుస్తకాల గురించి వెతికేవారు ఇతర చోట్ల కూడా అలాంటి పుస్తకాలనే వెతకవచ్చు. లేదా పాత సినిమాలను ఇంటర్నెట్‌లో శోధించేవారు, నిత్యం అదే పని మీదే ఉండవచ్చు.


ట్విట్టర్ లేదా ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కనుక మీరు మీ సెర్చ్‌లను కొనసాగిస్తుంటే... మీ ప్రొఫైల్‌ మొత్తం పట్టేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి తమ వెబ్‌సైట్లలో ఉంచిన ప్రకటనలని ఎవరు చూస్తున్నారనే విషయాన్ని రహస్యంగా ఉంచుతామని వివిధ సంస్థలు చెబుతూ ఉంటాయి. కానీ ఆయా ప్రకటనలకి కనుక కొన్ని రకాల ప్రోగ్రామ్‌లను జోడిస్తే, వాటిని ఎవరు చూస్తున్నారనే విషయాన్ని పనిగట్టేయవచ్చునట.


అదీ విషయం! వినడానికి కాస్త గందరగోళంగా ఉన్నా... మనం అంతర్జాలంలో చేసే ప్రతి పనినీ ఎవరో ఒకరు అధికారికంగానో, అనధికారికంగానో గమనించేసే అవకాశం ఉందని చెప్పడం ఈ పరిశోధన లక్ష్యం! కాబట్టి వ్యక్తిగతం అనుకున్న ఫోన్‌నెంబర్ల వంటి వివరాలను, ఫొటోలను మన సామాజిక మాధ్యమాలలో ఉంచకపోవడమే మేలు.

 

- నిర్జర.