ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

రాజ్యాంగ పరంగా ఏర్పడిన వ్యవస్థ అయినా సరే రాష్ట్ర ఎన్నికల సంఘం మా ఆధీనంలో పని చేయాల్సిందేనని మంకుపట్టు పట్టి కూర్చున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు పదే పదే గుర్తు చేస్తున్నా మారడం లేదు. 

 

అదే వైఖరితో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు పని చేస్తూ ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశంపై ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 

 

స్థానిక ఎన్నికల నిర్వహణపై నవంబరు 4వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంది. అందుకే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కసరత్తు ప్రారంభించారు. ఒక వైపు ఈ కసరత్తు కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని జరగకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

 

అందులో భాగంగానేనా అన్నట్లు సోమవారం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సమావేశంలో ఎవరు పాల్గొంటారు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేకుండా ఈ సమావేశానికి హాజరుకావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు వాట్ప్ యాప్ లో మెసేజ్ వచ్చింది. 

 

రాజ్యంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కి చెందిన కార్యదర్శి ఈ విధంగా సమావేశానికి రావాలని ఆదేశాలు ఇవ్వడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. రాష్ట్రంలో జరగబోయే పార్లమెంటు ఉప ఎన్నిక, శాసన మండలి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల విషయం పై ఈ నెల 26న అంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చించేందుకు రావాలని ఆ మెసేజి సారాంశం. 

 

ఘాటైన సమాధానం ఇచ్చిన ఎన్నికల కమిషనర్ కార్యాలయం
ఈ నెల 28న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ విధమైన మెసేజి ఎన్నికల కమిషనర్ కు రావడం ఏమిటి? ఎన్నికల కమిషనర్ ను ఈ విధంగా ప్రభుత్వ అధికారి సమన్ చేయవచ్చా? ఇవేవీ ఆలోచించకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం మెసేజీలు పంపేసింది. 

 

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నుంచి వచ్చిన ఈ మెసేజికి ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఘాటైన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు అయిన వ్యక్తి అని ఈ విధంగా ఒక సమావేశానికి తనను రావాల్సిందిగా ప్రభుత్వ అధికారి కోరడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని సమాధానం లో పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

 

ఈ విధంగా  విధులకు భంగం కలిగిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం విషయాన్ని సంబంధిత న్యాయస్థానం దృష్టి కి తీసుకువెళ్లాల్సి ఉంటుందని కూడా ఘాటుగా సమాధానం ఇవ్వడంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు తాము చేసిన తప్పేంటో తెలిసింది. 

 

తనకు తెలియకుండా సమావేశాలకు వెళ్లవద్దని, తన కార్యదర్శిని రమేష్‌ కుమార్ ఆదేశించారు. 26 నుంచి విజయవాడలో అందుబాటులో ఉంటానని కార్యదర్శికి తెలిపారు. రమేష్ కుమార్ సమాధానం చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం తగ్గుతుందా లేక ఇంకా అదే విధంగా ప్రవర్తిస్తుందా అనేది చూడాలి.