TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మ‌గాళ్లంతా రేపిస్టులు కాదు.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ క్లారిటీ..

Published on: Wed Feb 2, 2022 4:39PM

పురుషులందు పుణ్య‌పురుషులు వేరు. మ‌గాళ్ల‌లో కొంద‌రు మృగాళ్లు ఉంటారు. అంతమాత్రాన పురుషులంద‌రూ రేపిస్టుల‌ని విమ‌ర్శించ‌డం త‌గ‌దు. ఇలాంటి స్టేట్‌మెంట్ చేసింది మ‌రెవ‌రో కాదు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆస‌క్తి నెల‌కొంది.

ప్రతి పెళ్లినీ దౌర్జన్యపూరితమైనదిగా, ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌గా విమర్శించడం సరైనది కాదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. వైవాహిక అత్యాచారం (మారిటల్ రేప్)పై సీపీఐ నేత బినయ్ విశ్వం అడిగిన అనుబంధ ప్రశ్నకు సమాధానంగా బుధవారం ఆమె రాజ్యసభలో ఆ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని తెలిపారు. అయితే ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించాలని చెప్పడం సరైనది కాదన్నారు. 

గృహహింస నిర్వచనంపై గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్ 3ను.. అత్యాచారంపై ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిశీలించిందా? అనే అంశాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టు.. బినయ్ విశ్వం రాజ్య‌స‌భ‌లో ప్రశ్నించారు. దీనిపై స్మృతి ఇరానీ జ‌వాబిస్తూ...

‘‘ఈ దేశంలో ప్రతి పెళ్లినీ ఓ దౌర్జన్యపూరితమైన పెళ్లిగానూ, ఈ దేశంలోని ప్రతి పురుషుడినీ ఓ రేపిస్ట్‌గానూ ఈ గౌరవప్రదమైన సభలో  విమర్శించడం సరైనది కాదు’’ అన్నారు. రాష్ట్రాల సహకారంతో దేశంలోని మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 హెల్ప్‌లైన్స్ పని చేస్తున్నాయని, వీటి ద్వారా దాదాపు 66 లక్షల మంది మహిళలకు సహాయం అందిందని చెప్పారు. 703 వన్ స్టాప్ సెంటర్ల ద్వారా 5 లక్షల మందికిపైగా మహిళలు సహాయం పొందారని తెలిపారు. 

మ‌రోవైపు.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన అనేక పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. భార్యపై భర్త అత్యాచారం చేస్తే, భర్తను భారత శిక్షా స్మృతి ప్రకారం విచారించేందుకు అవకాశం లేదు. భర్తలకు ఇచ్చిన ఈ మినహాయింపును రద్దు చేయాలని ఈ పిటిషన్లు కోరుతున్నాయి.