TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్మృతీఇరానీని ఎందుకు తప్పించినట్లు!

Published on: Wed Jul 6, 2016 12:25PM

 

మోదీ తన క్యాబినెట్‌ను విస్తరించనున్నారన్న వార్తలు రాగానే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఎవరిని తప్పిస్తారు? ఎవరికి కొత్తగా చోటుని కల్పిస్తారు? ఎవరి శాఖను మారుస్తారు? అంటూ ఎవరికి తోచినట్లు వారు విశ్లేషించడం మొదలుపెట్టారు. కానీ స్మృతీఇరానీకి శృంగభంగం కలుగుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. కారణం! మానవవనరుల శాఖ అంటేనే స్మృతీఇరానీ అన్నంతగా ఆమె ఆ శాఖ మీద ముద్ర వేశారు. కానీ దాంతోపాటుగా అపవాదులూ మూటగట్టుకున్నారు.

 

మానవవనరుల మంత్రిగా స్మృతీఇరానీ ప్రస్థానమే వివాదాస్పదంగా మొదలైంది. 2004లో ఒకరకంగా, 2014లో మరోరకంగా తన విద్యార్హతల గురించి పేర్కొనడం ఆమెను ఇరుకున పెట్టింది. పైగా ఓ రెండు వారాల పాటు అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణలో పాల్గొని, దాన్ని కూడా ఒక గొప్ప డిగ్రీగా ఆమె చూపించుకోవడం హాస్యాస్పదంగా మారింది. దాంతో చదువుల తల్లి స్థానంలో ఉండాల్సిన మనిషే, తన చదువుల గురించి తరచూ అబద్ధాలు చెప్పినట్లు అయ్యింది.

 

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలోని రోహిత్‌ వేముల ఆత్మహత్య సందర్భంలోనూ, దిల్లీ విశ్వవిద్యాలయాలలో అఫ్జల్ గురు సమావేశపు సందర్భంలోనూ.... స్మృతి ఇరానీ మరింత సంయమనం పాటించి ఉండాలన్నది బీజేపీ అభిప్రాయంగా కనిపిస్తోంది. నిజానికి ఈ రెండు సందర్భాలలోనూ స్మృతి తన పార్టీని గట్టిగానే వెనకేసుకువచ్చారు. కానీ ఈ వివాదాల వల్ల పార్టీకి వచ్చిన చెడ్డపేరుని మాత్రం నివారించలేకపోయారు. భాజపా దళిత, ముస్లిం వ్యతిరేక పార్టీ కాదన్న విషయాన్ని నిరూపించేందుకు స్మృతిని ఇప్పుడు తప్పించినట్లు కనిపిస్తోంది. క్యాబినెట్లోకి ఏకంగా ఐదురుగు దళితులను తీసుకోవడం చూస్తే, బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అవలింబించిందో ఇట్టే అర్థమవుతోంది.

 

స్మృతీ ఇరానీని మానవవనరుల శాఖ నుంచి తప్పించి జౌళి శాఖకు మార్చారు మోదీ. అయితే ఈ మార్పుతో స్మృతీఇరానీ ప్రాభవం ముగిసిపోయినట్లుగా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ శాఖలో ఉన్నా తనదైన మద్ర వేయడం ఆమెకు కొత్తేమీ కాదు. అలాగే ప్రస్తుతం దీనావస్థలో ఉన్న జౌళి శాఖను స్మృతీ పరుగులు తీయించినా ఆశ్చర్యపోనవసరం లేదు!