TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వక్ఫ్ బిల్లు చట్టబద్ధత పై స్టే విధించలేం : సుప్రీంకోర్టు

Published on: Wed Apr 16, 2025 4:48PM



 

ఎన్డీయే సర్కార్ ఆమోదించిన  వక్ఫ్ బిల్లు చట్టంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు నేడు విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసి ఎంపీ మహువా మొయిత్ర, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్, అర్జీడి ఎంపీ మనోజ్ కుమార్ ఝ, ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్, వైసీపీ, డిఎంకె, టీవికే అధినేత విజయ్, సిపిఐ సహా కొన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయి. 

ఇక, పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లుపై రేపు మధ్యాహ్నం మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోనే సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ముస్లిం సమాజంలో మత, ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని.. ఇది మైనార్టీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు దుర్మార్గమైందని.. రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడిగా ఈ బిల్లును ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కొత్త చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవడంతో భూమి ఆక్రమణలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.