TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్మార్ట్‌ సిటీల రగడ

Published on: Fri Jan 29, 2016 2:16PM

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారు నిన్న ప్రకటించిన 20 స్మార్ట్‌ సిటీల జాబితా తెలంగాణ వాదులకి నిరాశను మిగిల్చింది. రాబోయే ఐదు సంవత్సాలలో వేలాది కోట్లని వెచ్చింది ఈ స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే ఇందులో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా ఎంపిక కాకపోవడంతో తెలంగాణ నాయకులు పక్షపాతం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్నం, కాకినాడలకి చోటు దక్కగా తెలంగాణ తరఫున వరంగల్‌ మాత్రం కూతవేటు దూరంలో చతికిలబడింది. అయితే ఇందులో తన తప్పేమీ లేదనీ, స్మార్ట్‌ సిటీల ఎంపిక ఆద్యంతం పారదర్శకంగానే జరిగిందంటున్నారు వెంకయ్య నాయుడు. కొన్ని నగరాలు ఎందుకు ఎంపిక కాలేదో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే నిలదీయమని అంటున్నారు. ఎందుకంటే స్మార్ట్‌ సిటీలను ఎంపిక చేసేందుకు సదరు నగర పాలక సంఘం అందించిన నివేదిక, అక్కడి పరిస్థితులు, ఆ నగరంలోని ప్రజల అభిప్రాయాలు… వంటి ఎన్నో అంశాలకు మార్కులు కేటాయించింది కేంద్రం.

తెలంగాణ నుంచి వరంగల్‌, కరీంనగర్‌ను ఈ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండూ కూడా తుది జాబితాలో చోటు చేసుకుంటాయని అందరూ ఆశించారు. కానీ దురదృష్టవశాత్తూ కరీంనగర్‌ నగరపాలక శాఖ అసలు నివేదికనే సమర్పిచలేదు. ఇక వరంగల్‌ మాత్రం కేవలం కొద్దిపాటి తేడాతో 23వ స్థానంలో నిలిచి తృటిలో అవకాశాన్ని కోల్పోయింది. నిజానికి కేవలం తెలంగాణ మాత్రమే కాదు… ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల నగరాలకు కూడా ఈ తుది జాబితాలో చోటు దక్కలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌ అయితే ఏకంగా 13 నగరాలను స్మార్ట్‌సిటీ కోసం సూచించినా వాటిలో ఒక్కటి కూడా ఎంపిక కాలేదు. వీటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా ఉంది. ఏకంగా ప్రధానమంత్రి సూచించిన నగరానికే ఈ జాబితాలో చోటు దక్కలేదంటే పారదర్శకతకు ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది అంటున్నారు వెంకయ్యనాయుడు. మరి కొద్ది రోజులలో మరో 23 నగరాలను ఎంపిక చేస్తామని, ఈసారి పక్కాగా ప్రతిపాదనలను పంపమని సూచిస్తున్నారు. అప్పడు కూడా తెలంగాణకు చోటు దక్కకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లొల్లి తప్పదేమో!