సెంచరీ వైపు పరుగులు పెడుతున్న ఉల్లి.. సామాన్యుడి బెంబేలు...

 

గడచిన కొద్ది కాలంగా ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి. ఉల్లిపాయ కొస్తే కన్నీళ్లు రావడం సహజం. ఐతే తాజాగా ఉల్లి ధర చూస్తుంటే సామాన్యుడికి కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ఢిల్లీ లో ఉల్లి ధర రూ 70 నుండి రూ 80 కి చేరి సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. హైదరాబాద్ లో ఐతే ఉల్లి ధర రూ 50 నుండి రూ 60 వరకు ఉంది. సాధారణంగా మూడు నాలుగు కిలోలు ఒకే సారి కొనే వినియోగదారుడు ఒక కిలో కొనడానికి కూడా వెనుకాడే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఐతే రానున్న రోజలలో ఇది మరింత పెరిగి సెంచరీ కొట్టే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఉల్లి పండే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఎపి, గుజరాత్ లలో భారీ వర్షాల కారణంగా కొంత పంట నష్టపోవడం అలాగే వచ్చిన పంట రవాణా లో ఇబ్బందులు కారణమని తెలుస్తోంది. అలాగే ఉల్లి ధర ఘాటెక్కడంతో కేంద్రం రంగంలోకి దిగి, ఉల్లి నిల్వ ఉంచిన రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు రవాణా చేసుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.