TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆకుపచ్చ ఆకాశం.. గగనంలో అద్భుత దృశ్యం

Published on: Fri Jul 8, 2022 12:16PM

శ్రీహరి మేనును నీలాకాశంతో పోలుస్తాం. మబ్బులు పట్టిన ఆకాశం నల్లగా ఉంటుంది. ఎండా వానా కలిసి వచ్చినప్పుడు ఆకాశం సప్త వర్ణాలతో సుందరశోభితంగా విరాజిల్లుతుంది. సాయం సంధ్యలో ఆకాశం ఎర్రగా కనిపించడం సాధారణమే. ఆయితే ఆకుపచ్చని వాతావరణాన్ని ఏ కవీ ఊహించలేదు. ఏ వాతావరణ శాస్త్రవేత్తా ఇప్పటి వరకూ కనుగొన్నదీ లేదు. అలాంటిది అమెరికాలో ఆకాశం ఆకుపచ్చ వర్ణం సంతరించుకుంది. అది అందంగా ఉందా? లేదా అన్నది పక్కన పెడితే ఆకాశం ఆకుపచ్చ రంగు సంతరించుకోవడాన్ని చూసి జనం భయాందోళనలకు గురయ్యారు.

వాతావరణ శాస్త్రవేత్తలూ ఇలా ఎందుకు జరిగిందా అన్న పరిశోధనల్లో మునిగి పోయారు. అమెరికాలో  ఎన్నడూ లేని విధంగా ఆకాశం ఆకుపచ్చ రంగు పులుముకుంది.    అమెరికాలోని సౌత్ డకోటా, సియోక్స్ ఫాల్స్ ప్రాంతాల్లో భారీ తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ తగ్గిన అనంతరం ఆకాశమంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.  

అధికారులు  సైతం ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారడం ఇప్పటి వరకూ  చూడలేదన్నారు.  వాతావరణ శాస్త్రవేత్తలు  మాత్రం ఎర్రటి సూర్య కిరణాలు సాయంత్రం వేళలో తుఫాన్ లోని నీరు, ఐస్ అణువులతో కలవడం వల్ల మేఘాలు ఆకుపచ్చ రంగులోకి మారాయనీ, ఇదేమీ విపత్తు సూచిక కాదనీ చెబుతున్నారు.