జీవితమే ఒక ఇల్లయితే!

 

ఒకానొక పట్టణంలో ఒక అద్భుతమైన వడ్రంగి ఉండేవాడు.  కేవలం చెక్కతోనే అతను అందమైన ఇంటిని కట్టిపారేసేవాడు. అతను కట్టిన ఇంటిని చూసిన వారెవ్వరికైనా, ఉంటే అలాంటి ఇంట్లోనే ఉండాలనిపించేంది. ఒక ఇంటికీ మరో ఇంటికీ పొంతన లేకుండా, అతను నిర్మించిన ప్రతి ఇల్లూ ఓ కళాఖండంగా తోచేది. వడ్రంగి గురించి ఆ నోటా ఆ నోటా విన్న ఒక వ్యాపారస్తుడు అతని దగ్గరకు వచ్చాడు.

 

‘నేను ఇళ్ల వ్యాపారం చేస్తుంటాను. నాకు అవసరమైనప్పుడల్లా ఒక ఇంటిని నిర్మించి ఇవ్వగలవా!’ అని అడిగాడు వ్యాపారస్తుడు. వడ్రంగికి అంతకంటే కావల్సింది ఏముంది. ‘చేతి నిండా పని, పూట గడిచిపోయే డబ్బు... అది చాలు’ అనుకున్నాడు. వెంటనే పనిలోకి చేరిపోయాడు. వడ్రంగి ఏమాత్రం ఒళ్లు దాచుకునేవాడుకాదు. ఎప్పటిలాగే తన ప్రతిభనంతా చూపించేవాడు. చెక్కా, శిల్పమా అన్నంత అందంగా ఇంటిపని చేసేవాడు. అతను వచ్చిన దగ్గర్నుంచీ వ్యాపారస్తునికి కూడా విపరీతంగా కలిసి వచ్చింది. లక్షలకు లక్షలు లాభంతో బోలెడు చెక్క ఇళ్లను అమ్మాడు.

 

ఇలా ఒకటి కాదు రెండు కాదు... చాలా సంవత్సరాలే గడిచిపోయాయి. రానురానూ వడ్రంగి ఒంట్లో సత్తువ తగ్గిపోసాగింది. ఇక ఈ పని చేయడం తన వల్ల కాదనుకున్నాడు. అందుకనే ఒక రోజు వ్యాపారస్తుని దగ్గరకు వెళ్లి తన నిర్ణయాన్ని చెప్పేశాడు. ‘వడ్రంగి వల్ల తనకు విపరీతమైన లాభాలు వచ్చిన మాట నిజమే! కానీ అతడి పరిస్థితి చూస్తే ఇక మీదట విశ్రాంతి అవసరం,’ అని వ్యాపారస్తునికి కూడా అనిపించింది.

 

``నీ మాటను కాదనలేకపోతున్నాను. కానీ చివ్వరగా ఒకే ఒక్క ఇంటిని కట్టిపెట్టవా!’’ అని అర్థించాడు వ్యాపారస్తుడు.
వ్యాపారస్తుని మాటలు విన్న వడ్రంగి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరో ఇంటిని కట్టిపెట్టడానికి ఒప్పుకున్నాడు. కానీ అప్పటికే అతని మనసులో వడ్రంగి పని మీద విరక్తి ఏర్పడిపోయింది. పైగా ఇక తన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదనిపించింది. అన్నింటికీ మించి, అతనికి మరో ఇంటిని కట్టడం అంటే ఏమాత్రం ఆసక్తి లేదు. అయినా తప్పదు కనుక బలవంతంగా పనిని మొదలుపెట్టాడు.

 

వడ్రంగి తన జీవితంలో చివరగా కడుతున్న ఇల్లు చాలా నాసిరకంగా సాగింది. ఎప్పటిలాగా ఇది మంచి చెక్కా కాదా! అని వడ్రంగి బేరీజు వేసుకోలేదు. ఫలానా చెక్క గాడిలో కుదురుకుందా లేదా అని పట్టించుకోలేదు. రంగు వేసేముందు తగినంతగా నగిషీ చేశానా లేదా అని పట్టించుకోలేదు. ఫలితం! అతని జీవితంలోనే అత్యంత చవకబారు నిర్మాణాన్ని అతను పూర్తిచేశాడు.

 

`మీరు చెప్పినట్లుగానే ఇంటిని పూర్తిచేశాను. ఇక సెలవు తీసుకుంటాను!’ అంటూ వ్యాపారస్తుని దగ్గరకు వెళ్లి నిల్చొన్నాడు వడ్రంగి.‘భలేవాడివే! ఆ ఇంటిని నీ కోసమే నిర్మించమని అడిగాను. నీ వల్ల నేను చాలా లాభపడ్డాను, మరి నీ కోసం ఒక ఇంటిని నిర్మించలేకపోతే ఇక నేనెందుకు?’ అన్నాడు వ్యాపారస్తుడు చిరునవ్వుతో.

 

వడ్రంగికి నోట మాట రాలేదు. తన ఇల్లు అని తెలిసి ఉంటే కనుక దానికి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకునేవాడో కదా!
చాలామంది వ్యక్తిత్వం ఇలాగే ఉంటుంది. తమ కోసం నిర్మించుకునే జీవితాన్ని ఏమాత్రం ఆసక్తి లేకుండా, ఏమరపాటుగా... తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసుకున్నాక అయ్యో కాస్త విచక్షణతో ప్రవర్తించి ఉంటే బాగుండేదే అని పశ్చాత్తాపపడతారు. కానీ ఏం లాభం! ఆ ఫలితంతోనే వారు మున్ముందు గడపాల్సి ఉంటుంది.

 

- నిర్జర.