అండర్ వరల్డ్ డాన్ కి గన్ శాల్యూట్.. ఆరుగురు అరెస్ట్!

అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ అంత్యక్రియల సందర్బంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఆరుగురిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మరణించిన ముత్తప్ప రాయ్‌ అంత్యక్రియల సందర్భంగా ఆయన బంధువు ఒకరు, మరొక ఐదుగురు ఆయనకు గన్ శాల్యూట్ చేశారు. కర్ణాటక రామనగర జిల్లా బిడదిలో ఈ ఘటన జరిగింది. నిందితులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినట్లు బిదడి పోలీసులు తెలిపారు. 

కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ముత్తప్ప రాయ్ నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అనుచరులు బిడదిలోని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన భౌతికకాయానికి గన్ శాల్యూట్ చేశారు. ఆయుధాల చట్టం కింద ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.