పుట్టిన తేదీ మార్చినందుకు ప్రభుత్వానికి జరిమానా

 

ప్రభుత్వ ఉద్యోగాలలో చేరేవారు తమ జన్మతేదీ దృవీకరణ పత్రాలను విధిగా సమర్పించడం, దానిని ఆధారంగా తీసుకొని వారి సర్వీస్ కాలం లెక్కకట్టడం సాధారణ విషయమే. ఒకసారి సర్వీస్ రికార్డులో జన్మ తేదీ నమోదు చేయబడిన తరువాత ఇక దానిని ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేయడం సాధ్యం కాదు. అందుకు చట్టం కూడా అనుమతించదు. అయితే, ఈ చట్టాలకు అతీతులమని భావించేవారు కొందరు ఉంటే, అటువంటి వారికి ప్రభుత్వం కూడా అండగా నిలుస్తుంటుందని ఈ కేసు నిరూపిస్తోంది.

 

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్ శివారెడ్డి సర్వీసు రికార్డులో తన పుట్టిన తేదీ తప్పుగా నమోదు చేయబడిందని, అందువల్ల దానిని 1954 బదులుగా 1956గా సవరించమని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ సర్వీసు రికార్డులో ఆయన పుట్టిన తేదీని ఆయన కోరినట్లు మార్చేందుకు ఒక జీఓ జారీ చేసింది.

 

గంగాధర్, రామ్మూర్తి అనే ఇద్దరు వ్యక్తులు ఈ జీవోను సవాలు చేస్తూ ట్రిబ్యునల్లో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన ట్రిబ్యునల్ ఆ జీవోను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ శివారెడ్డి, ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురయింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శివారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

 

న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ చల్లా కోదండరామ్‌లతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టివేస్తూ సర్వీసు రిజిస్టర్‌లో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ నిబంధనల్లోని రూల్ 4(1)(బి) ప్రకారం పుట్టిన తేదీ సవరణపై నిషేధం ఉందని గుర్తు చేసింది. అంతే గాకుండా శివారెడ్డికి, అతనిని వెనకేసుకు వచ్చిన ప్రభుత్వానికి చెరో రూ. 10 వేల జరిమానా కూడా విధించింది. ఈ మొత్తాన్ని ప్రతివాదులుగా ఉన్న గంగాధర్, రామ్మూర్తిలకు చెల్లించాలని ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.