ఒకే వేదికపైకి కమల్, రజనీ

ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ రజనీ, కమల్ ‌చుట్టూ తిరుగుతున్నాయి. సినిమాలు క్రమ క్రమంగా తగ్గించేస్తూ వస్తున్నఈ ఇద్దరు సూపర్‌స్టార్లు ఇప్పుడు రాజకీయరంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రజనీ రాజకీయరంగ ప్రవేశంపై కమల్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో తలైవా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి కమల్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి..నిరసన తెలుపుతున్నారు.

 

ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకే వేదిక మీదకు చేరారు. చెన్నైలో జరిగిన శివాజీ మెమోరియల్ ప్రారంభోత్సవ వేడుకకు రజనీ, కమల్ హాజరయ్యారు. గత ఏడాది ఆగష్టు 4న చెన్నై, కామరాజర్ సారైలోని శివాజీ విగ్రహాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు మరోచోటికి తరలించింది ప్రభుత్వం..అయితే ఈ చర్యపై శివాజీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు చెన్నై అడయార్‌లో సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో 28,300 చదరపు అడుగుల్లో శివాజీ గణేశన్ మెమోరియల్‌ను నిర్మించింది ప్రభుత్వం. దీని ప్రారంభోత్సవానికి రావాలని శివాజీ తనయుడు ప్రభు సీఎం పళనిస్వామిని కోరాడు. అయితే ముందుగా అనుకొన్న కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నానని వివరణ ఇచ్చుకున్నారు..అయితే తన ప్రతినిధిగా పన్నీర్‌ సెల్వంను పంపుతున్నట్లు స్వయంగా ప్రభు ఇంటికి వెళ్లి చెప్పారు ముఖ్యమంత్రి. దీనిలో భాగంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో కలిసి రజనీ, కమల్ పాల్గొన్నారు. అనంతరం వారిద్దరూ శివాజీతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.