TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్!

Published on: Wed Jun 18, 2025 10:56AM

చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్ అయ్యింది. ఆలూ లేదు చూలూ లేదు.. అన్న సామెత చందంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మద్యం కుంభకోణంలో తనను ఇరికించాలన్న కుట్ర జరుగుతోందంటూ నానా యాగీ చేశారు. చెవిరెడ్డి  ఈ యాగీ చేసే సమయానికి అసలు చెవిరెడ్డి పేరు మద్యం కుంభకోణం నిందితులలో లేనే లేదు. ఈ కేసులో అరెస్టైన నిందితులు విచారణలో తన పేరు వెల్లడించి ఉంటారన్న అనుమానంతో చెవిరెడ్డి హడావుడి చేశారు. తన వద్ద పని చేసిన వారినీ, తన స్నేహితులనూ బెదరించి, వేధించి తనకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారంటూ సిట్ పై ఆరోపణలు గుప్పించారు.  తనను అరెస్టు చేయడమే సిట్ లక్ష్యమైతే.. తానే స్వయంగా సిట్ కార్యాలయానికి వచ్చి స్వచ్ణందంగా అరెస్టౌతాను అంటూ గంభీరమైన ప్రకటనలు చేశారు. మీడియా ముందు సవాళ్లు చేశారు. దాదాపు తొడకొట్టి మీసం మెలేసినంత పని చేశారు.

ఇంతా చేసి.. చల్లగా దేశం దాటేయడానికి ప్రయత్నించారు. అయితే బెంగళూరు విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయారు. లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయనను బెంగళఊరు విమానాశ్రంయలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సిట్ కు సమాచారం ఇచ్చారు. సిట్ హుటాహుటిన బెంగళురుకు బయలుదేరి వెళ్లింది. ఈ రోజు ఆయనను విజయవాడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక చెవిరెడ్డి కోసం ఆయన వద్ద పదేళ్ల పాటు గన్ మెన్ గా పని చేసిన మదన్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ కోర్టుకెక్కారు. సిట్ తనను చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధించిందనీ, మ్యాన్ హ్యాండిల్ చేసిందనీ పిటిషన్ దాఖలు చేశారు.  సరే సిట్ మదన్ రెడ్డి ఆరోపణలు నిర్ద్వంద్వంగా ఖండించింది. ఆ ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు మదన్ రెడ్డి తమ విచారణకు సహకరించలేదని పేర్కొంది.

అది పక్కన పెడితే.. చెవిరెడ్డి విషయంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సహా ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసింది.   దీంతో మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఓవరేక్షన్  చేసి తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా ముందుగానే అరెస్టు సవాళ్లు విసిరి సిట్ అదుపులోకి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.