సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో చరమాంకం!
Published on: Tue Jun 26, 2012 6:08PM
దేశవ్యాప్తంగా నల్లనేలగా గుర్తింపునందుకున్న సింగరేణి బొగ్గుగనుల కార్మికసంఘ గుర్తింపు ఎన్నికలు ఉప ఎన్నికల కన్నా ఘాటుగా మారి చరమాంకానికి చేరుకున్నాయి. ఇక ఓటింగే తరువాయి. ప్రచారఘట్టం ముగిసింది. ఈ ప్రచారఘట్టంలో ఉప ఎన్నికల వాతావరణాన్ని టిఆర్ఎస్, సిపిఐ నేతలు సృష్టించారు. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేధోరణిలో టిఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రసంగించారు. ఈయన ఈ గుర్తింపు యూనియన్లోనూ తెలంగాణావాదాన్ని చొప్పించారు. ఇది తప్పు అని సిపిఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఎఐటియుసి తరుపున నారాయణ, టిబిజికెఎస్ తరుపున హరీశ్రావు ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఈ ప్రచారం ఆద్యంతం ప్రత్యర్థులపై విమర్శలతో ప్రత్యక్ష ఎన్నికలను తలపించాయని కార్మికులు అభిప్రాయపడ్డారు. తాము స్వేచ్ఛగా అవసరమైన యూనియన్ను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.


