TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తల్లిదండ్రులు ఈ టిప్స్ ఫాలో అయితే.. పిల్లలలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి!

Published on: Sat May 23, 2026 12:40PM

పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే..

పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్..

వ్యక్తీకరణ..

 పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది.

విజయాల గుర్తింపు..

పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది.

విలువలు,సంప్రదాయాలు..

పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

సహనం, ఓర్పు..

 గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన అలవాట్లు..


 సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది.

వైఫల్యాల నుండి నేర్చుకోవడం..

 పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది.

చెప్పేది వినాలి..

  పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది .

వినయం..

 ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి.

తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.

                                            *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...