మెదడు బాగుండాలా? రెండు నిమిషాలు మౌనం పాటించండి!


నిశ్శబ్దానికి ఉన్న విలువ గురించి భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వేల సంవత్సరాల క్రితమే వారికి మౌనంలో దాగిన జ్ఞానం గురించి అవగాహన ఉంది. అందుకే మనసుని నిశ్చలంగా నిలిపి ఉంచే ధ్యానాన్ని కనిపెట్టారు. ‘ఊరికే అలా రాయిలాగా నిశ్చలంగా కూర్చుంటే ఏంటి ఉపయోగం? అంటూ ఒకప్పుడు గేలి చేసిన పాశ్చత్య ప్రపంచం కూడా ఇప్పుడు మౌనం వల్ల కలిగే అద్భుత ఫలితాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.


మెదడు మరింత చురుగ్గా!


ఓ నాలుగు సంవత్సరాల క్రితం నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉంటే, మెదడుకి ఏమన్నా ఉపయోగం ఉందేమో కనుక్కోవాలన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. ఆలోచన వచ్చిందే తడువుగా కొన్ని ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. రోజుకి రెండు గంటలపాటు ఎలుకలకి ఎలాంటి శబ్దమూ చేరకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ఉండనిచ్చారు. దాంతో వాటి మెదడులోని హిప్పోకేంపస్ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడటం చూసి పరిశోధకులు బిత్తరపోయారు. మన జ్ఞాపకాలు, ఉద్వేగాలు, నైపుణ్యాలను నియంత్రించడంలో ఈ హిప్పోకేంపస్‌ది ముఖ్యపాత్ర! అంటే నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండటం వల్ల మన మెదడు మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్నమాట.


సమస్య మరింత తేలికగా!

 

నిశ్శబ్దంలో ఉండటం లేదా మనసుని నిశ్చలంగా ఉంచుకోవడం వల్ల... సమస్యలని పరిష్కరించడం కూడా తేలికగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు అటూఇటూ పోకుండా నేరుగా సమస్య మీదే తన దృష్టిని కేంద్రీకరించేందుకు కావల్సిన స్వేచ్ఛ దొరుకుతుందట. సరికొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే అవకాశమూ దక్కుతుంది. మెదడుని అలా నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేస్తే, అసలు ఆలోచనలే ఉండవు కదా! అన్న అనుమానం రావచ్చు. మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా, మనం ఏ సమస్యనైతే మెదడుకి అందించామో.... దాన్ని విశ్లేషిస్తూనే ఉంటుంది.


శబ్దంతో ఒత్తిడి

 

ఇప్పటివరకూ నిశ్శబ్దం గురించి చెప్పుకొన్నాం కాబట్టి, ఇప్పుడు శబ్దం వల్ల ఏర్పడే ఫలితం కూడా ఓసారి చూద్దాం. చుట్టూ అదేపనిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటే శరీరం, ఒత్తిడిని కలిగించే రసాయనాలను (stress hormones)ను విడుదల చేస్తుందని తేలింది. గాఢ నిద్రలో ఉన్నా కూడా పక్కనే వినిపించే శబ్దాలకు మెదడు కంగారుపడుతూనే ఉంటుందట. నిరంతరం రణగొణధ్వనుల మధ్య ఉండే పిల్లల్ని గమనించినప్పుడు.... ఆ శబ్దాలు వారి చదువు, ఎదుగుదల, తెలివితేటల మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఆ శబ్దాలకు అలవాటుపడిన పిల్లలు ఆఖరికి ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో కూడా విశ్లేషించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారట!

 

ఏతావాతా... నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయడం, మనమూ మౌనంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తేలిపోయింది! అందుకే రెండు నిమిషాల పాటు మంచి సంగీతాన్ని విన్నప్పుడు కలిగే హాయికంటే, రెండు నిమిషాల పాటు మౌనంగా ఉన్నప్పుడ పొందే ప్రశాంతతే ఎక్కువని తేల్చారు పరిశోధకులు.

- నిర్జర