TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డోలో 650తో సైడ్ ఎఫెక్ట్స్‌.. జ‌ర జాగ్ర‌త్త‌...

Published on: Thu Feb 3, 2022 4:59PM

జ్వ‌రం వ‌చ్చిందా? డోలో వేసుకో. ఒళ్లు నొప్పులు ఉన్నాయా? ఇంకో డోలో. త‌ల‌నొప్పి, జ‌లుబుకి.. ఆఖ‌రికి క‌రోనా వ‌చ్చినా డోలోనే దిక్కు. ఇప్పుడంతా డోలో జ‌పం. చీటికీమాటికీ.. అయిందానికీ, కానిదానికీ.. అన్నిటికీ డోలో 650 వేసేస్తున్నారు. రోజుకు నాలుగు మింగేస్తున్నారు. ఎందుకైనా మంచిద‌ని.. మ‌రో రెండు డోలోలు ఎక్కువ‌గా క‌డుపులో ప‌డేసే వాళ్లూ ఉన్నారు. అందుకే, సోష‌ల్ మీడియాలో డోలోపై అంత‌గా మీమ్స్ వ‌స్తున్నాయి. 

అస‌లే 650ఎమ్‌జీ డోస్‌. సాధార‌ణ ప‌రిమాణంకంటే ఈ డోస్‌ కాస్త ఎక్కువే. అందుకే, అతిగా వాడితే అదేమంత సేఫ్ కాదంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్స్‌. మంచి చేసే డోలోను.. ఓవ‌ర్‌గా వాడేస్తే.. చెడు కూడా చేసే ప్ర‌మాదం ఉంద‌ని సూచిస్తున్నారు. క‌రోనా కాలంలో జ‌నాలు ఇష్టం వ‌చ్చిన‌ట్టు డోలో 650 వాడ‌టం త‌గ‌ద‌ని చెబుతున్నారు. డాక్టర్ సలహా మేర‌కే వేసుకోవాలని అంటున్నారు. 

డోలో మాత్రలు ఎక్కువగా వేసుకోవ‌డం వల్ల.. లో బీపీ వచ్చే సమస్య ఉందని చెబుతున్నారు. తల దిమ్ముగా ఉన్నట్టు అనిపించ‌డం.. నీరసం.. మలబద్దకం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఇక‌, పిల్ల‌ల‌కి డోలో వేసేటప్పుడు మ‌రింత‌ జాగ్రత్త అవ‌స‌రం. చిన్న పిల్ల‌ల‌కు 650 ఎమ్‌జీ డోస్ ఎక్కువ‌వుతుంద‌ని.. వారి కడుపులో ఒక రకమైన వికారం కలిగే అవ‌కాశం ఉందంటున్నారు. చాలా మంది పిల్లలు డోలో టాబ్లెట్ వేసిన తర్వాత మత్తుగా ఉంటూ.. నిద్ర పోవ‌డానికి కార‌ణం అదే అని చెబుతున్నారు. 60 ఏళ్ల పైబ‌డిన పెద్ద వ‌య‌సు వారికి, దీర్ఘకాల వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారికీ.. ఈ డోస్ ప‌రిమితికి మించిందే అంటున్నారు. అందుకే, డోలో 650 అతిగా వాడేవారు జ‌ర జాగ్ర‌త్త‌.