TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

డబుల్ బెడ్ రూమ్ ఇంటిని తిరిగిచ్చేసింది!              

Published on: Fri Jan 8, 2021 2:04PM

ప్రభుత్వ పథకం అంటే అందరికి ఆశే. సర్కార్ ఇచ్చేది కదా అని అనర్హులు కూడా వాటి కోసం ఎగబడుతుంటారు. పేదలకు అందాల్సిన సాయాన్ని కూడా కక్కుర్తితో కొందరు పెద్దలు కొట్టేస్తుంటారు. తమకు అన్ని ఉన్నా.. ఏమి లేవని తప్పుడు లెక్కలు చూపిస్తూ కొందరు సంక్షేమ పథకాలను తీసుకుంటూ ఉంటారు. కాని ఈ మహిళ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇంటిని తిరిగిచ్చేసింది. తనకు ఉండటానికి  నివాసం ఉందని.. మరో పేద మహిళకు ఇస్తే ఆ కుటుంబం బాగుంటుందనే మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకుని అందరికి ఆదర్శంగా నిలిచింది. 
   
సిద్ధిపేట జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళకు  తెలంగాణ ప్రభుత్వం  డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేసింది. భర్త లేని ఆమె కూతురుతో కలిసి జీవనం సాగిస్తుండటంతో సర్కార్ ఇల్లు వచ్చింది. అయితే ఆ మహిళ తనకు సర్కార్ ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తిరిగి ఇచ్చేసింది. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె ఈ నిర్ణయం ప్రకటించింది.  తాను, తన కుమార్తె మాత్రమే ఉంటామని, తన సోదరుని ఇంట్లో ఉంటున్నామని చెప్పింది. తన కూతురుకు వివాహం జరిగితే తాను ఒంటరిగానే ఉంటానని, ఒంటరిగా ఉండలేను కాబట్టి.. తన సోదరుని వద్దే ఉంటానంది. తనకిచ్చిన ఇల్లు మరో పేద మహిళకు ఇస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇంటిని తిరిగి ఇచ్చేస్తున్నానని లక్ష్మీ తెలిపింది. 

 మంచి మనసుతో లక్ష్మి తీసుకున్న  నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు అభినందించారు. అందరూ లక్ష్మిలా ఆదర్శవంతగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెను జిల్లా కలెక్టర్, ఛైర్మన్ శాలువా కప్పి సన్మానించారు. పది రూపాయలు అప్పనంగా వస్తున్నాయని తెలిసినా.. గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడే ఈ రోజుల్లో.. ప్రభుత్వం ఉచితంగా అందించిన డబుల్ బెడ్ రూమ్ ను మరో మహిళకు ఇవ్వాలంటూ తిరిగి ఇచ్చేయడం నిజంగా అభినందనీయమే.. అందరూ లక్ష్మికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే..