నేను సుద్దపూసని.. ఇట్లు సిద్దరామయ్య!
Published on: Mon Aug 19, 2024 5:29PM
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద విచారణ జరపడానికి గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడం కర్నాటకలో రాజకీయ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. ‘‘బీజేపీ ఆదేశాల ప్రకారం పనిచేసే గవర్నర్ నిర్ణయం నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎలాంటి తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్ళు ఎదురైనప్పుడు నాలో జోష్ మరింత పెరుగుతుంది. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటి వరకు ఏ తప్పూ చేయని నేను భవిష్యత్తులో కూడా తప్పు చేయను. నా ప్రతిష్ఠని దెబ్బతీయడానికి బీజేపీ, జేడీఎస్ కుట్ర పన్నాయి. ఈ కేట్రను నేను రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాను. నన్ను నాశనం చేస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అవుతుందనే భ్రమలో ప్రతిపక్షాలు వున్నాయని సిద్దరామయ్య అన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ తరహాల్లోనే కర్నాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిపరిచడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది’’ అన్నారు. ‘ముడా’ వ్యవహారంలో తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.


