నగరం మునిగిపోతుంటే.. బంగారు బిస్కెట్లా..?

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుస వివాదాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. 70 లక్షల విలువ చేసే వాచ్ వివాదంతో మొదలుపెట్టి.. కాకి వాలిందని కాన్వాయ్ మార్చడం, నిండు సభలో మహిళా నేతతో ముద్దు పెట్టించుకోవడం, సీఎం హోదాలో అసభ్యపదజాలంతో మాట్లాడటం పట్ల ప్రజల్లో సిద్దూపై వ్యతిరేకతను తీసుకువచ్చాయి. వీటిని అవకాశాలుగా తీసుకొన్న ప్రతిపక్షాలు సిద్ధరామయ్యని ఏకీపారేశాయి. ఆ తర్వాత జనం వీటిని మరచిపోయారనుకోండి. తాజాగా ఏరీ కోరీ మరో వివాదాన్ని కొని తెచ్చుకొన్నారు సిద్ధూ. ఓ పక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బెంగళూరు తడిసి ముద్దవుతోంది.

 

అస్తవ్యస్తమైన డ్రైనేజీకి తోడు రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి ఎందరో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకపక్క ప్రజలు కష్టపడుతుంటే.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసే వ్యవహారానికి సిద్ధూ సర్కార్ తెరతీసింది. కర్ణాటక విధాన సౌధ భవన సముదాయాన్ని నిర్మించి 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

మొత్తం 300 మంది ప్రజాప్రతినిధులకు బంగారు బిస్కెట్లు ఇచ్చేందుకు గాను సుమారు రూ.3 కోట్లు విడుదల చేసింది. అలాగే సిబ్బందికి కూడా రూ. 6 వేల విలువ చేసే వెండి కంచాలు బహూకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25న జరగనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొంటారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఓ పక్క భారీ వర్షాలతో బెంగళూరు మునిగిపోతుంటే ఎమ్మెల్యేలకు కానుకలు ఇవ్వాల్సిన సమయమా ఇది అంటూ ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జన జీవనాన్ని తిరిగి గాడిలోకి పెట్టాల్సిందిపోయి బంగారు బిస్కెట్లు పంచాలనుకోవడమేంటీ..? అంటూ ప్రశ్నిస్తున్నారు.