కేసీఆర్‌ సొంత జిల్లాలో నలుగురు ఎస్సైల సూసైడ్‌... ఎందుకిలా జరుగుతోంది?

 

తెలంగాణలో ఎస్సైల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సైల ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. హక్కుల కోసం కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాలుగో సింహం నలిగిపోతున్నాడు. 24 అవర్స్‌... 365 డేస్... ఆన్‌ డ్యూటీ‌... ఇలాంటి డైలాగులు సినిమాల్లోనే వినడానికి బాగున్నా... కిందిస్థాయి పోలీసులు ఇదే తరహాలో పనిచేయిస్తున్నారు. ఓ మనిషిగా కనీస అవసరాలు తీర్చుకోలేక.... ప్రాథమిక హక్కులు పొందలేక... ఓ మర మనిషిలా పనిచేస్తూ మానసికంగా చితికిపోతున్నారు. ఒకవైపు తీరికలేని విధులు.... మరోవైపు ఉన్నతాధికారుల వేధింపులకు బలైపోతున్నారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో ఆరేడుగురు ఎస్సైలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లాలోనే నలుగురు ఎస్సైలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2015 సెప్టెంబర్‌లో రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్‌.... చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పదస్థితిలో మరణించగా, 2016 జనవరిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. 2016 ఆగస్ట్‌‌లో మెదక్‌ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో పోస్టింగ్‌ ఇవ్వడం లేదంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యువ ఎస్సై కిరణ్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. ఇదే తరహాలో ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్సై కాశమేని శ్రీధర్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని తనువు చాలించాడు. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు అయితే తన భార్యను రివాల్వర్‌తో కాల్చి.... తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏదైనా లేటెస్ట్‌గా కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ శాఖలో కలకలం రేపుతోంది.

 

ఎస్సైల ఆత్మహత్యలకు పని భారం, ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు, అవినీతే కారణంగా తెలుస్తోంది. చేయని తప్పుకు ఎస్సైలు బలైపోతున్నారు. పలువురి సూసైడ్‌ నోట్స్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటూ, శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే ఎస్సైలు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపర్చే అంశమే. ఏదిఏమైనా ఎస్సైల ఆత్మహత్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం కనిపిస్తోంది.