పోలీసు నియామకాలపైనే ఫోకస్! కేసీఆర్ వ్యూహం ఇదేనా?

తెలంగాణ రాష్ట్రంలో మరో వెయ్యి మందికి పైగా సబ్ ఇన్స్ పెక్టర్లు విధుల్లో చేరబోతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఎస్ఐల పరేడ్ కూడా పూర్తైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎక్కువగా పోలీస్ శాఖలోనే నియమకాలు జరిగాయి. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటివరకు1,25,848 మంది వివిధ ర్యాంకులకు చెందిన వారికి శిక్షణ ఇచ్చినట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీనే తెలిపారు. ఇందులో 18 వేల 428 మంది ఎస్.ఐ, కానిస్టేబుళ్లే. తెలంగాణ లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పోలీస్ శాఖకు అధిక బడ్జెట్, ఆధునిక పరికరాల కొనుగోలు, సాంకేతికతను సమకూర్చామని చెప్పారు హోంశాఖ మంత్రి.  తెలంగాణ  పోలీస్ శాఖలో పెద్దఎత్తున నియామకాలు జరిగాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

 

తెలంగాణ వచ్చాక పోలీసు శాఖలోనే ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నారు. గత ఆరేండ్లలో కేసీఆర్ సర్కార్ భర్తీ చేసిన ఉద్యోగాల్లో సగానికి పైగా ఒక్క పోలీస్ శాఖలోనే ఉన్నాయి. పోలీస్ శాఖలో ఖాళీలు లేకున్నా కొత్త పోస్టులు స్పష్టించి మరీ నియామకాలు చేపడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తెలంగాణ జనాభా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉండాల్సిన వారి కంటే ఎక్కువే ఎస్ఐలు ఉన్నారని తెలుస్తోంది. పోలీస్ శాఖకు గతంలో కంటే బడ్టెట్ కూడా భారీగా పెంచారు. వాహనాలను భారీగా సమకూర్చారు. హైటెక్ టెక్నాలజీని కూడా పోలీసులకు అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. విదేశాల నుంచి కూడా అత్యాధునిక పరికరాలను తెప్పించింది. ఇక హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిర్మిస్తోంది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ శాఖపైనే ఎందుకు ఫోకస్ చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ దీనిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. 

 

పోలీస్ శాఖ ద్వారా తమకు కావాల్సింది చేసుకోవాలనే లక్ష్యంతోనే కేసీఆర్ సర్కార్ ముందుకు వెళుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలపై నిఘా పెట్టడం, వారి కదలికలను గమనించడం వంటి పనుల కోసమే పోలీసు శాఖను బలోపేతం చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో పోలీసులను ఉపయోగించి గట్టెక్కవచ్చన్నది కేసీఆర్ భావనగా  చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి పేవర్ గా పనిచేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలు టీఆర్ఎస్ లో చేరేలా పోలీసులతో బెదిరించారనే ఫిర్యాదులు కూడా గతంలో వచ్చాయి.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. విపక్షాలు ఎలాంటి నిరసనకు పిలుపిచ్చినా.. రాత్రికి రాత్రే వారిని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్నారు. విపక్ష నేతలను రోడ్డుమీదకు రావడానికే అనుమతించడం లేదు. 

 

గతంలో జరిగిన ఆర్టీసీ సమ్మెతో పాటు పలు ఉద్యమాల సమయంలో... పోలీసులనే ప్రధానంగా వాడుకుంది ప్రభుత్వం. పోలీసులతో బస్సులు నడిపించే ప్రయత్నం కూడా చేసింది. ఇటీవల శ్రీశైలం పవర్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగినా.. అక్కడికి విపక్ష నేతలెవరు వెళ్లకుండా పోలీసులతో కట్టడి చేసింది కేసీఆర్ సర్కార్. కల్వకుర్తి పంపులు మునిగినా.. కాళేశ్వరం కాలువలు తెగినా పరిశీలించేందుకు ప్రతిపక్ష నేతలకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలోని విపక్ష నేతల కదలికలను గమనించేందుకు విదేశాల నుంచి తెప్పించిన పరికరాలను పోలీసులు వినియోగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రఘునందన్ రావు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేశారు. 

 

తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షన్నరకు పైగా ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. సరిపడా ఉద్యోగులు లేక పాలనలో ఇబ్బంది అవుతుందని ఉద్యోగ సంఘాలు కూడా చాలా సార్లు ప్రకటించాయి.ఖాళీలను భర్తీ చేయాలని సీఎస్ కు వినతి పత్రాలు కూడా ఇచ్చాయి. కాని కేసీఆర్ సర్కార్ మాత్రం ఉద్యోగ నియామకాలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల ఊసే ఎత్తడం లేదు. టీఎస్పీఎస్సీ నుంచి కొత్త నోటిఫికేషన్లు రాకా చాలా కాలమైంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలనే ఇంకా భర్తీ చేయలేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 2017లో రాతపరీక్ష జరిగిన గ్రూప్ 2 ఫలితాలను గత నెలలో విడదుల చేసింది. అది కూడా పట్టభద్రుల మండలి ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతోనే చేసిందని చెబుతున్నారు. 
    

టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక టీచర పోస్టుల భర్తీ ఎండమావిగానే మారింది. మూడేండ్లు డీఎస్సీ వేయకపోవడంతో నిరుద్యోగుల్లో ఉద్యమాలు చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 9 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికలకు వాడుకుంది. కాని ఇప్పటికి అవి ఇంకా పూర్తి కాలేదు. ట్రైనడ్ గ్రాడ్యువేట్ టీచర్ పోస్టులలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలంటూ టిజిటి మెరిట్ అభ్యర్థులు కొన్ని రోజులుగా  ధర్నాలు చేస్తున్నారు. అయినా టీఎస్పీఎస్సీలో చలనం లేదు. కాని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మాత్రం వరుసగా నియమకాలు చేపడుతూనే ఉంది. కరోనా సమయంలోనూ ఎస్ఐలు, కానిస్టేబుళ్ల శిక్షణను కొనసాగించింది. దీన్ని బట్టే పోలీసు శాఖకు కేసీఆర్ సర్కార్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తోంది. అయితే పోలీసులను ప్రజల కోసం ఉపయోగిస్తే మంచిదే కాని... ఇలా విపక్ష నేతలను అడ్డుకోవడానికి, సొంత అజెండా అమలు చేయడానికి వాడుకుంటే మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. ఇలా చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.