సరైన పాదరక్షలు లేకపోతే... జీవితం అంతే!

 

మనం బట్టల ఎన్నుకోవడంలో చూపే శ్రద్ధ పాదరక్షల మీద ఉంచము. ఒకవేళ చెప్పులో, షూలో కొనుక్కోవడానికి వెళ్లినా... అవి చూడటానికి బాగున్నాయా, ఎక్కువకాలం మన్నుతాయా, తక్కువ ధరకి వస్తున్నాయా అని ఆలోచిస్తామే కానీ నడవడానికి సౌకర్యంగా ఉన్నాయా లేదా అని పట్టించుకోం. ఇలాంటి అశ్రద్ధే మన కొంప ముంచుతుందని చెబుతున్నారు నిపుణులు...

 

వయసు పెరిగేకొద్దీ జాగ్రత్త!

కుర్రతనంలో ఎలాంటి చెప్పులు ధరించినా చెల్లిపోతుంది. కానీ వయసు మళ్లేకొద్దీ అలా కాదు! పాదం ఆకృతి మారిపోతుంది. వాటి ఒడ్డూపొడవులో మార్పులు వస్తాయి. నొప్పిని తట్టుకునే శక్తిలో తేడా ఏర్పడుతుంది. పాదం అడుగుభాగంలో ఉండే కొవ్వు, కండరాలలో కూడా పరివర్తన ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయితే రెండు పాదాలకీ వేర్వేరు సైజ్ ఉన్న చెప్పులు ధరించాల్సినంతగా మార్పులు జరుగుతాయి. వీటికి తోడు ఊబకాయం, డయాబెటిస్, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా మనం నడిచే తీరు మీదా, పాదాల ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతాయి.

 

ఇంత జరుగుతున్నా...

పాదరక్షల గురించి మరింత శ్రద్ధ వహించాల్సిన వయసులో కూడా మనం చాలా అశ్రద్ధగా వ్యవహరిస్తాం అంటున్నారు నిపుణులు. దీనికోసం లోపెజ్  (Lopez) అనే పరిశోధకుడు ఓ రెండు సర్వేలను నిర్వహించాడు. మొదటి సర్వేలో 80 ఏళ్లు పైబడినవారు పాదరక్షల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో గమనించారు. దాదాపు 83 శాతం మంది, తమ పాదాలకంటే పెద్దవో చిన్నవో (different size) పాదరక్షలు ధరిస్తున్నట్లు తేలింది.

 

లోపెజ్ నిర్వహించిన రెండో సర్వేలోనూ దారుణమైన వాస్తవాలే వెలుగుచూశాయి. తగిన పాదరక్షలు ధరించనివారు తమకి తెలియకుండా చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. పాదాలలో విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచేటప్పుడు ఆయాసం వంటి సమస్యల దగ్గర నుంచి అదుపుతప్పి పడిపోవడం వరకూ... జీవితాన్ని తలకిందులు చేసే ఎన్నో సమస్యలు అపసవ్యమైన పాదరక్షలతో ముడిపడి ఉన్నాయని గ్రహించారు. దీని వల్ల ఏకంగా వారి జీవితమే ప్రభావితం అవుతోందని తేల్చారు.

 

జాగ్రత్తపడాల్సిందే!

సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల ఇన్నేసి అనర్థాలు ఉన్నాయని తెలిశాక ఇక జాగ్రత్తపడకపోతే ఎలా! అందుకనే ఏవన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పాదరక్షల గురించి ఓసారి తమ వైద్యునితో మాట్లాడితీరాలి. పాదానికి మెత్తగా ఉండేలా, నడిచేటప్పుడు పట్టుని ఇచ్చేలా, కీళ్ల మీద ఒత్తిడిని కలిగించకుండా ఉండే పాదరక్షలను ఎన్నుకోమని చెబుతున్నారు. అలాగే పాదం ఆకారానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకునే స్ట్రాప్స్ ఉండే పాదరక్షలని ధరించమని సూచిస్తున్నారు.

- నిర్జర.