ఇదా చిన్నారుల రక్షణ...?

దేశం ఎక్కడికి పోతోంది. దేశం ఏమై పోతోంది. ప్రభుత్వాలు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చున్నాయేటీ...? మానవత్వం మాడి మసైపోతున్నదేమిటీ..? ప్రజా ప్రభుత్వమని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏలికలో ఈ దారుణాలేమిటీ..? యాదగిరిగుట్ట. పవిత్ర పుణ్యక్ష్రేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు ఆ నరసింహస్వామిని దర్శించుకునే పవిత్ర క్షేత్రం. అయితే అక్కడ వెలుగు చూసిన, చూస్తున్న సంఘటనలు మాత్రం రక్తమాంసాలున్న వారినెవ్వరిని నిద్రపోనివ్వడం లేదు. అభం... శుభం... తెలియని చిన్న పిల్లలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. అందుకోసం ఆ నిర్వాహకులు చేస్తున్న అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావు. ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయని ఏలికలకు తెలిసినా... వారిలో చలనం ఉండదు. 

 


యాదగిరిగుట్టను తెలంగాణకు తిరుమల చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్కడ జరుగుతున్న సంఘటనలకు ఏమని సమాధానం చెబుతారు. పదుల సంఖ్య వ్యభిచార ముఠాలు అక్కడ సంచరిస్తూ చిన్నారుల చేత బలవంతపు వ్యభిచారం చేయించడం ఎంత దారుణం. అక్కడి అఘాయిత్యాలు బయటపడడానికి పోలీసుల పాత్ర ఏమీ లేదు. వ్యభిచార నిర్వాహకులు చేసిన పొరపాటు కారణంగా... వారి నుంచి ఓ అమ్మాయి తప్పించుకుని వచ్చి బయటి ప్రపంచానికి అక్కడి దారుణాలను వెల్లడించింది. అంతే పోలీసులు ఆ ఇళ్లపై దాడులు చేసి పదుల సంఖ్యలో చిన్నారులను కాపాడారు.

 

 

యాదగిరిగుట్టలో వెలుగుచూస్తున్న దారుణాలు వింటూంటే... పత్రికల్లో చదువుతూంటే ఎవరికైనా కన్నీళ్లు జలజలా రాలుతాయి. రైల్వే స్టేషన్ల నుంచి, బస్ స్టేషన్ల నుంచి, జాతరల నుంచి చిన్న పిల్లలను ఎత్తుకొచ్చి వారిలో ఎదుగుదల కోసం ఇంజక్షన్లు ఇచ్చి మరీ వారి చేత వ్యభిచారం చేయిస్తున్నారంటే అలాంటి వారిని ఏం చేయాలి. పోలీసుల కళ్ల పడకుండా ఉండేందుకు ఇళ్లల్లో బంకర్లు సైతం ఏర్పాటు చేసుకుని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారంటే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి. ఇలా యాదగిరిగుట్ట వ్యభిచార రొంపిలో చిక్కుకున్న వారు ఒకరు, ఇద్దరు కాదు.... వందకు పైగానే ఉన్నారు. వారంతా ఎక్కడో ఒకచోట నుంచి ఎత్తుకొచ్చిన వారే. ఓ తల్లి తన కూతురు తప్పిపోయిన కొన్నాళ్ల తర్వాత ఈ వ్యభిచార కూపంలో ఆ చిన్నారిని చూసిందంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుంది. గతంలో వచ్చిన ఓ సినిమాలో సంఘటనలే ఇక్కడ కనపడుతూండడంతో ఆ తల్లులు, తండ్రుల, బంధువుల మనోవేదనను ఎలా అర్ధం చేసుకోగలం. సమాజంలో ఇలాంటి నీచులు... అది కూడా సాటి ఆడవారే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటే వారిని ఏమనాలి. ఎలా శిక్షించాలి.

 

 

తల్లీ... మమ్మల్ని క్షమించు అని ఓ మాట అనేస్తే సరిపోతుందా... ? పోనీ మమ్మల్ని శిక్షించు అంటే చాలుతుందా.. ? ముమ్మాటికి చాలదు... ముమ్మాటికి సరిపోదు. యాదగిరిగుట్ట సంఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావూ.... ఆయన మంత్రివర్గం నైతిక బాధ్యత వహించాలి. ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్న వారిని... ఇక ముందు ఇలాంటివి చేయడానికే కాదు... కనీసం ఊహించడానికి కూడా భయపడేలా శిక్ష వేయాలి. అయితే అవన్నీ జరుగుతాయా... మనది ప్రజాస్వామ్య దేశం. ఘనత వహించిన మన చట్టాలు నేరగాళ్లను రక్షించడంలో ముందుంటాయి.

 

 

ఇలా అరెస్టు అయిన నేరగాళ్లు అలా బెయిలుపై  విడుదలవుతారు. కొన్నాళ్లు ఈ కేసులు నడుస్తాయి. తర్వాత ప్రజలూ మరచిపోతారు. పోలీసులు కూడా ఇలాంటి కేసులను తర్వాత పట్టించుకోరు. మళ్లీ ఇవే సంఘటనలు జరుగుతాయి. అయితే ఊర్లు మారతాయి... ప్రదేశాలు మారతాయి... నేరగాళ్లు మారతారు.... అభం... శుభం తెలియని చిన్నారులు మారతారు. పాలకులు కూడా మారవచ్చు. మారనివి చట్టాలు.... పోలీసుల నైజం. ఇలాంటి దారుణ వ్యవస్ధ ఉన్నప్పుడు... ఇంతటి నీచపు మనుషులు ఉన్నప్పుడు... సమాజం ఎలా బాగుపడుతుంది. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు.... కుక్కల వలె... నక్కల వలె... సందులలో పందుల వలె... మనదీ ఒక బతుకేనా....మనదీ ఒక సమాజమేనా...!!