బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్ షేక్! గ్రేటర్ లో హంగ్ ఫలితాలు 

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు గులాబీ పార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. సొంతంగానే రెండోసారి జీహెచ్ఎంసీపై పాగా వేయాలన్న కారు పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ట్ అంచనాలు తలకిందులవుతూ  గ్రేటర్ లో హంగ్  ఫలితాలు వచ్చాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో  గతంలో కంటే దాదాపు 40 డివిజన్లను కోల్పోయింది అధికార టీఆర్ఎస్ పార్టీ. 2016 ఎన్నికల్లో ఏకపక్ష విజయంతో 99  సీట్లు సాధించిన టీఆర్ఎస్.. ఈసారి మాత్రం 60 లోపే ఆగిపోయింది. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచినా.మేటర్ పీఠం కైవసం చేసుకోవడానికి కావల్సిన మేజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. తమ పార్టీ కున్న ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసినా సొంతంగా టీఆర్ఎస్ కు మేయర్ పీఠం చేపట్టే అవకాశం లేదు. 

 

2016 ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి టీఆర్ఎస్ కు చుక్కలు చూపించింది. సైలెంట్ గా దూసుకొచ్చి కారు స్పీడుకు బ్రేకులు వేసింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా  దాదాపు 50 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది కమలం పార్టీ. ఓల్ట్ సిటీలోనూ బాగా పుంజుకున్న బీజేపీ.. ఎంఐఎంకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు కొన్ని డివిజన్లు గెలిచింది. కాంగ్రెస్ మరోసారి గ్రేటర్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. గతంలో రెండు సీట్లు గెలిచిన హస్తం పార్టీ.. ఈసారి కూడా రెండు డివిజన్లు గెలుచుకుంది. పాతబస్తిలో  తన పట్టు మరోసారి నిలుపుకుంది ఎంఐఎం. గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకుంది. కొత్తగా న్యూసిటిలోనూ పాగా వేసింది పతంగి పార్టీ. బోలక్ పూర్ లో ఎంఐఎం విజయం సాధించింది. గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ, వామపక్షాలు ఎక్కడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. 

 

కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి, జూబ్లీహిల్స్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో  టీఆర్ఎస్ జోరు కనిపించింది. ముఖ్యంగా కూకట్ పల్లి సర్కిల్ లో కారు స్వీప్ చేసింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని డివిజన్లలో  దాదాపు 90 డివిజన్లను అధికార పార్టీనే గెలుచుకుంది. ఎల్బీనగర్, గోషా మహాల్, ముషిరాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభంజనం వీచింది. ఎల్బీ నగర్ జోన్ లో 11కు 11  డివిజన్లు గెలిచి కమలం పార్టీ స్వీప్ చేసింది. గోషామహాల్ నియోజకవర్గంలో గతంలో ఒక్క డివిజన్ గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకుంది. ఎంఐఎం పట్టున్న ప్రాంతాల్లోనూ కమలం వికసించింది. మల్కాజ్ గిరి, ఉప్పల్ లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఈ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలను మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

 

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ కనీసం పోటీ ఇవ్వకపోగా.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగింది. చాలా డివిజన్లలో లీడ్ లు మారుతూ వచ్చాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో చెరి సగం సీట్లు గెలుచుకోగా.. ముషిరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి లీడ్ వచ్చింది. అంబర్ పేటలో కారు పార్టీ తక్కువ  మెజార్టీతోనే కొన్ని సీట్లు ఎక్కువ గెలుచుకుంది. సనత్ నగర్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నా.. గతంలో గెలిచిన కొన్ని డివిజన్లలను నిలుపుకోలేకపోయారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.  ఖైరతాబాద్ నియోజకవర్గంలో టఫ్ పైట్ జరిగినా.. అధికార పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం పట్టు నిలుపుకుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ సత్తా చాటింది బీజేపీ. 

 

గ్రేటర్ ఫలితాలతో షాకైంది గులాబీ దళం. తొలి రౌండ్ ఫలితాల్లో ముందుండటంతో తెలంగాణ భవన్ లో సంబరాలు కూడా చేశారు. అయితే సాయంత్రానికి సీన్ మారడంతో టీఆర్ఎస్ కార్యాలయం బోసి పోయింది. మేజిక్ ఫిగర్ రాకపోవడంతో సంబరాలు కూడా ఆపేశారు. చివరి రౌండ్ లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రావడంతో.. ఆ పార్టీ కార్యాలయం దగ్గర సందడి కనిపించింది. బండి సంజయ్, లక్ష్మణ్ లు పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. తాము అనుకున్నదాని కంటే ఎక్కువ ఫలితాలు సాధించామని బీజేపీ నేతలు చెప్పారు. గ్రేటర్ ఫలితాలపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ షాకిస్తూ.. బీజేపీకి ప్లస్ అయినా పూర్తి స్థాయిలో గెలిపించకుండా.. ఎంఐఎంకు కొంత షాకిస్తూ గ్రేటర్ ఓటర్లు గ్రేటర్ తీర్పు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.