కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఊహించని షాక్
Published on: Thu May 9, 2019 4:16PM

అవకాశం దొరికానప్పుడల్లా రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ఎన్నికల సమయంలో అయితే విమర్శల డోసు పదింతలు పెరుగుతుంది. ప్రత్యర్థి పార్టీ అది చేయలేదు ఇది చేయలేదంటూ విమర్శలు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతారు. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీ ఆ హామీ నెరవేర్చిందా? ఈ హామీ నెరవేర్చిందా? అని కార్యకర్తలను అడిగి.. వారు నెరవేర్చలేదని చెప్పగానే నేతలు ఆనందపడతారు. ఇలాంటి ఆనందమే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కావాలనుకున్నారు. కానీ ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
స్మృతి ఇరానీ బుధవారం మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు రుణమాఫీ అందిందా’ అని స్మృతి ప్రశ్నించారు. దీనికి అక్కడున్నవారంతా ఒక్కసారిగా ‘అందింది.. అందింది’ అని గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పారు. ఈ ఊహించని సమాధానంతో స్మృతి ఇరానీ కంగుతిన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విటర్‌లో పోస్టు చేస్తూ బీజేపీపై విమర్శలు చేసింది. ‘వారి అబద్ధాలకు ఇప్పుడు ప్రజలు కూడా నేరుగా జవాబిస్తున్నారు’ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


